Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడనీ, సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ సుపారీ ఇచ్చింది. మహిళతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దరిపల్లి వెంకటేష్ అలియాస్ రోజా హత్య జరిగిన మూడు వారాల తర్వాత అతడి భార్య వేదశ్రీ , ఇతర నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట నివాసులైన వేదశ్రీ, దరిపల్లీ వెంకటేష్ కి 2014లో వివాహం జరిగింది. వీరికి 2015లో ఒక పాప పుట్టింది. తర్వాత.. వెంకటేష్ అదనపు కట్నం పేరుతో భార్యను వేధింపులకు గురి చేశాడు. ఆమె దూరం పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వెంకటేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి.. ట్రాన్స్ జెండర్ గా మారాడు. రోజాగా పేరు మార్చుకున్నాడు. ఈ పరిణామంతో వేద శ్రీ షాక్ గురైంది. తన జీవితం నాశనమైందని ఆవేదన గురైంది. తన పాప కోసమైన బతకాలని నిర్ణయించుకుని వెంకటేష్( రోజా)తో ఏళ్లుగా వేర్వేరుగా ఉంటుంది.
ఈ క్రమంలో వేదశ్రీ ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. తన కుమార్తెను చూసుకుంది. కానీ, తన కుమార్తెను తనకు ఇవ్వాలని వెంకటేష్ (రోజా) వేదశ్రీని వేధింపులకు గురి చేసేవాడు. తను పనిచేసే పాఠశాలకు వచ్చి.. అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. పాఠశాలలో రోజా సమస్యలు సృష్టించడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. తన పరువు తీస్తున్నాడని కోపంతో అతడి అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది వేద శ్రీ. ఈ క్రమంలో వేదశ్రీ కొంతకాలంగా పట్టణానికి చెందిన బోయిని రమేష్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. అతనితో కలిసి రోజాగా మారిన వెంకటేష్ ను చంపాలని ప్లాన్ వేసింది.
అదే పట్టణానికి చెందిన బోయిని రమేష్ (32)తో స్నేహంగా మెలిగిన వేదశ్రీ.. రోజాను అంతమొందించేందుకు అతడితో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలో హంతకులతో రూ. 18 లక్షల సుఫారీని కుదుర్చుకుంది. పథకం ప్రకారం డిసెంబర్ 11న ఇప్పల శేఖర్ (24) అనే వ్యక్తి సహయంతో వెంకటేష్ అలియాస్ రోజాకు బీర్ తాగించి, నిద్రపోయిన తర్వాత రాత్రి సమయంలో మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో వెంకటేష్ ను దిండుతో నొక్కి ఉపిరాడకుండా చేసి హతమార్చారు.
ఈ ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. శవపరీక్ష నివేదికలో రోజా హత్యేనని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. వేదశ్రీని విచారించగా నేరం ఒప్పుకుంది. మొత్తం ఐదుగురు నిందితులు వేదశ్రీ హత్యకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆమెతోపాటు రమేష్, శేఖర్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.