Praja Palana Website:తెలంగాణలో వివిధ పథకాల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 న ముగిసింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Praja Palana Website: ఎన్నికల హామీల అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-అభయహస్తం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గతేడాది డిసెంబరు 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 న (శనివారం) ముగిసింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ https://prajapalana.telangana.gov.in/ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు.
ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరగనుంది