హయత్ నగర్ లో మంగళవారం జరిగిన బాలిక కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే అక్కడికి వచ్చినట్లు తేలింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడు ఓ కొత్త ట్రిస్ట్ వెలుగు చూస్తోంది.పెద్ద అంబర్పేట్ కు చెందిన ఓ బాలిక మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటికి రాగా ఇద్దరు వ్యక్తులు.. అడ్రస్ అడుగుతూ.. ముఖం మీద స్ప్రే కొట్టి కిడ్నాప్ చేసి, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరికి తీసుకువెళ్లారు.
అక్కడ పొదల్లో ఆమె మీద అత్యాచార యత్నం చేయగా…తప్పించుకుని రోడ్డుమీదికి వచ్చింది. అక్కడ ఓ హిజ్రా ఆమెను చూసి విషయం కనుక్కుని పోలీసులకు చెప్పడంతో… వారు ఆమెను రెస్క్యూ చేశారు. అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. అసలు అక్కడ కిడ్నాపే జరగలేదు. ఆమె మీద అత్యాచారయత్నమూ లేదు. అదంతా ఆ అమ్మాయి నడిపిన కథ అని తేలింది. స్నేహితుని కలవడానికి అక్కడికి వచ్చి.. హిజ్రాను చూసి భయపడి ఈ నాటకానికి తెరలేపినట్లుగా పోలీసులు తేల్చారు.
హైదరాబాద్ హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం... కాపాడిన హిజ్రా..
ఇంతకీ అసలు విషయం ఏంటంటే…ఆ బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్ చాట్ లో ఓ యువకుడితో పరిచయమైంది. ఒకరికొకరు ఫోటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. బయట కలుసుకుందాం అనుకున్నారు. దీని ప్రకారమే మంగళవారం రాత్రి ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చింది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఆ యువకుడు బైక్ మీద వచ్చాడు. అతని పేరు అరవింద్.
అతనితోపాటు ఆమె అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరికి చేరుకుంది. అక్కడికి వచ్చిన తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటుండగా ఓ హిజ్రా అక్కడ ఉండడం బాలిక గమనించింది. వెంటనే భయపడింది. తాను యువకుడితో బయటికి వచ్చిన సంగతి బయటపడిపోతుందని అనుకుంది. వెంటనే.. ఓ ఐడియా వేసింది. దాని ప్రకారం.. ముందుగా యువకుడిని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పింది.
అతను వెళ్ళిన తర్వాత తన అనుకున్న నాటకం మొదలుపెట్టింది.. హిజ్రా చూసేలాగా ఏడుస్తూ, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం జరిగిందని ఆమె అడగగానే తనని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని కథ అల్లింది. అంతేకాదు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారని.. తన తప్పించుకుని వచ్చానని.. సహాయం చేయమంటూ కోరింది. దీంతో హిజ్రా వెంటనే.. పోలీసులకు సమాచారం అందించింది.
బాలికకు ధైర్యం చెప్పింది. హిజ్రా ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మారు. దీని మీద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలోఈ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూడడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.