రేవంత్ రెడ్డికి షాక్: కాంగ్రెసుకు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రాజీనామా

By telugu teamFirst Published Oct 26, 2021, 8:49 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి కూడా పంపించారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మల్కాజిగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, సీనియర్ నేత ఆకుల రాజేందర్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సోమవారంనాడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు Akula Rajender తెలిపారు. కౌన్సిలర్ గా, సెంట్రల్ ఫిలం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, 2009లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా లేఖ ప్రతిని సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ఆకుల రాజేందర్ తెలిపారు. 

Also Read: ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు: రేవంత్ రెడ్డికి డీజీపీ కౌంటర్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత Reavanth Reddy పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకులను కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకుల రాజేందర్ రాజీనామా చేయడం కొంత మేరకు పార్టీకి నష్టమే.

ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి KCR మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి వద్ద ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం తెలుగు తల్లి వద్ద ఆగిందని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో తెలుగు తల్లిని దూషించిన కేసీఆర్ నేడు ప్లీనరీ స్వాగత తోరణం వద్ద తెలుగు తల్లి విగ్రహం పెట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ 20 ఏళ్ల ప్రస్థానం తెలుగు తల్లి వద్ద ఆగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు కాబట్టి వారిని మెప్పించడానికి తెలుగు తల్లి విగ్రహాన్ని అగ్రభాగాన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు తల్లికి ప్రాధాన్యం ఇచ్చారంటే కేసీఆర్ ఎవరికి గులాంగా మారినట్లని ఆయన ప్రశ్నించారు. 

Also Read: దేవుడి మాన్యం పంపకాల్లో గొడవే.. కేసీఆర్- ఈటల విడిపోవడానికి కారణం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ తో పాటు తన ఎదుగుదలకు కారణమైన మహానుభావులను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీని, ప్రొఫెసర్ జయశంకర్ ను, విద్యాసాగర రావును, గూడా అంజయ్యను, కేశవరావ్ జాదవ్ ను, కళ్లె యాదగిరి రెడ్డిని, గాదె ఇన్నయ్యను, చెరుకు సుధాకర్ ను, పాశం యాదగిరిని వంటివారిని ఎవరినీ ప్లీనరీలో కేసీఆర్ తలుచుకోలేదని ఆయన అన్నారు. 

click me!