
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలు విస్తరణపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మహారాష్ట్రలో విస్తరణ వేగవంతం చేసిన తరుణంలో మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ షిండే పక్షం శివసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేయనుందని, ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ వెల్లడించారు.
ఈ మేరకు ముంబయిలో రెండు రోజుల క్రితం పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌తో సింకారు శివాజీ, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపీ కిషన్‌లు సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక విషయాలపై చర్చ జరిగినట్టు తెలిపారు.
Also Read : నేడు స్కూల్స్, కాలేజీలు అన్ని బంద్.. ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
మహారాష్ట్రకు భౌగోళిక సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతాల నియోజకవర్గాల శివసేన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు శివాజీ తెలిపారు. ఈ మేరకే తమకు పార్టీ హైకమాండ్ ఆదేశించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్‌లు రహస్య మిత్రపార్టీలు అని, ఈ పార్టీలకు శివసేన సత్తా చూపిస్తామని శివాజీ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పాల్గొని మాట్లాడుతారని శివాజీ వివరించారు.