
హైదరాబాద్: గ్రూప్ 4 అభ్యర్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ ఫలితాలు విడుదలవుతాయా? అని చూస్తున్నారు. ఈ ఫలితాలపై టీఎస్‌పీఎస్సీ ప్రకటన కోసం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పని తీరు గురించి మాట్లాడారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే.. భర్తీ ప్రక్రియ పూర్తవడానికి కొన్ని ఏళ్లు పట్టేదని అన్నారు. కానీ, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ రెండు నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తున్నదని వివరించారు.
ఒకటి రెండు సమస్యలను చూపెడుతూ మొత్తం వ్యవస్థనే తప్పు పట్టడం సమంజసం కాదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అన్నారు. గ్రూప్ 4 ఫలితాలపైనా ఆయన స్పందించారు. గ్రూప్ 4 ఫలితాలకు ఇంకా సమయం ఉన్నదని వివరించారు.
Also Read: RYTHU BIMA: ఐదేండ్లు పూర్తిచేసుకున్న రైతుబీమా.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు
గ్రూప్ 4 పరీక్షలను జులై 1వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 80 శాతం మంది అభ్యర్థులు పరీక్్షలకు హాజరయ్యారు. పేపర్ 1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదే పేపర్ 2 పరీక్షను 7,61,198 మంది అభ్యర్థులు రాశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటానికి ముందే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముగించాలనే ప్రభుత్వం భావిస్తున్నది.