ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళం సందర్భంగా బాణసంచా పేల్చడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళంలో అపశృతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గుడిసెలో ఉన్న సిలిండ్ కూడా పేలింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇక, ప్రస్తుతం ఘటన స్థలంలో స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గాయపడినవారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కొందరి కాళ్లు, చేతులు కూడా తెగిపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
మరోవైపు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గాయపడిన తమవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.