Ramoji Rao: మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్ర వేశారాయన. నిత్యం శ్రమిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు.
Ramoji Rao: తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, రామోజీరావు(88) అంటే తెలియనివారు ఉండరు. ఆయన స్థాపించిన ఎన్నో సంస్థలు నేటికీ దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లాంటి మహా నగరాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆయన వ్యాపారాలు ఉన్నాయి.
రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన.. కఠోర శ్రమ, పట్టుదలతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడు, ఈటీవీతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా లాంటి అనేక సంస్థలను స్థాపించి విజయంతంగా నడిపిస్తున్నారు.
undefined
ఇక, ఈనాడుతో తెలుగు పత్రికా ప్రపంచంలో రామోజీరావు నవశకానికి నాంది పలికారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభమైన ఈనాడు తెలుగు నాట ఓ సంచలనం. ప్రారంభించిన కొన్నేళ్లలోనే పాఠకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత అనేక మాసపత్రికలు సైతం ప్రారంభించారు. అనుకున్నది సాధించేందుకు నిర్విరామంగా కృషి చేయడమే ఆయన విజయ రహస్యం. రామోజీరావు 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్థాపించారు. 60 ఏళ్లలో లక్షలాదిమంది ఖాతాదారులకు సొంతం చేసుకున్నారు. 1969లో మీడియా రంగంలోకి తొలి అడుగు వేసిన రామోజీరావు.. మొదట అన్నదాత పత్రికను స్థాపించారు. దీని ద్వారా వ్యవసాయంలో ఆధునిక విధానాలు, సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి ఎనలేని సేవ చేశారు. ఈనాడు పత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులను రామోజీ తయారు చేశారు. టీవీ రంగం ద్వారా వేలమంది నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు.
మీడియా రంగంతో సినీ ప్రపంచంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా అనేక చిత్రాలు నిర్మించారు. ఇక హైదరాబాద్‌లో అద్భుతమైన ఫిల్మ్ సిటీని సృష్టించారు. అక్కడ నిత్యం అనేక సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. పనిలోనే విశ్రాంతి అనేది రామోజీరావు పాటించే ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు ఆ సిద్ధాంతాన్ని పాటించారు.