సీనియర్ జర్నలిస్ట్ జీఎస్ వరదాచారి అస్తమయం...

By SumaBala Bukka  |  First Published Nov 4, 2022, 10:44 AM IST

ప్రముఖ పాత్రికేయులు జీఎస్ వరదాచారి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారాయన.


హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు డాక్టర్ గోవర్ధన సుందర వరదాచారి ఇకలేరు. తెలుగు పాత్రికేయలోకానికి జీఎస్ వరదాచారి గా సుపరిచితుడు అయిన ఆయన 90 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1932లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు లో జన్మించారు వరదాచారి.  డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ డిప్లమా చేశారు. ఆ సమయంలోనే యూనివర్సిటీ స్థాయి ‘ఉస్మానియా కొరియర్’ అభ్యాసన పత్రికకు ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1954లో జర్నలిజంలో అడుగుపెట్టారు.  

మొదట హిందూ పత్రికలో ఇంటర్న్షిప్ చేశారు. 1956లో ‘ఆంధ్రజనత’లో చేరారు. 1957లో జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వరదాచారి 1982- 83లో ఈనాడు  పత్రికలో వివిధ హోదాల్లో పని చేశారు. 1980లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించారు. వరదాచారి ఆంధ్రభూమి ఆంధ్రప్రభ పత్రికలకు సుదీర్ఘకాలం ఎడిటర్ గా వ్యవహరించారు.  తెలుగు  విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ  అధిపతి  బాధ్యతలు నిర్వహించారు.

Latest Videos

undefined

సీనియర్ జర్నలిస్టు కె.ఎల్. రెడ్డి మృతి

జర్నలిజంలో సేవలకుగానూ వరదాచారి తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో సత్కరించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ జర్నలిస్టుగా జీవన సాఫల్య పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. పత్రికా విలువలపై వరదాచారి పలు పుస్తకాలు రచించారు. మూసలో సాగుతున్న తెలుగు సినీ సమీక్షలను సినీ విమర్శకుడిగా కొత్త దారిలోకి మళ్ళించారు. ‘ఇలాగేనా రాయడం’,  ‘దిద్దుబాటు’, ‘మన పాత్రికేయ విలువలు’, ‘వరద స్వరాక్షర’ వంటి యువ పాత్రికేయులకు ఉపయుక్తమయ్యే ఇందులో ఉన్నాయి.

కేంద్ర సాహిత్య అకాడమీకి నార్ల వెంకటేశ్వరరావు మోనోగ్రాఫ్ ను అందించారు. ఆత్మకథను జ్ఞాపకాల వరద పేరిట అక్షరీకరించారు. వరదాచారికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘నార్ల జీవన సాఫల్య పురస్కారం’ ప్రధానం చేసింది. వరదాచారి భౌతికకాయానికి   శుక్రవారం ఉదయం 9 గంటలకు పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.  కాగా, సీనియర్ పాత్రికేయులు కె ఎల్ రెడ్డి,  వరదాచారి ఒకే రోజు కన్నుమూయడం పాత్రికేయ లోకానికి తీరని లోటు. 

పాత్రికేయ దిగ్గజాలు వరదాచారి కే ఎల్ రెడ్డి మృతికి సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, న్యాయ శాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

click me!