Kanam Rajendran : సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. 2015 నుంచి ఆయన రాష్ట్ర కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. కనం రాజేంద్రన్ మరణం పట్ల సీఎం పినరయ్ విజయన్, ప్రతిపక్ష నేత సతీశన్ సంతాపం వ్యక్తం చేశారు.
Kanam Rajendran : సీపీఐ సీనియర్ నాయకుడు, కేరళ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్ తన 73 ఏళ్ల వయస్సులో శుక్రవారం మరణించారు. సాయంత్రం 5.30 గంటలకు ఆకస్మిక గుండెపోటు రావడంతో కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన కాలికి గతంలో గాయమైంది. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలు రావడంతో ఈ ఏడాది అక్టోబర్ 25న ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
ఈ సారి కాస్త ముందుగానే ఇంటర్ పరీక్షలు.. కారణాలేంటంటే ?
రాజేంద్రన్ కు డయాబెటిస్ ఉండటంతో గాయం నయం కాలేదు. దీంతో ఇన్ఫెక్షన్ కారణంగా ఎడమ పాదాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆయన కోలుకుంటున్న సమావేశంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుకు గురికావడంతో క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
2015 నుంచి రాజేంద్రన్ సీపీఐ కేరళ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1950 నవంబర్ 10న కొట్టాయం జిల్లా కూటికల్ లో జన్మించారు. చిన్న వయసులోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 23 ఏళ్ల వయసులోనే సీపీఐ యువజన విభాగమైన ఆల్ ఇండియా యూత్ ఫ్రంట్ (ఏఐవైఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత 28 ఏళ్ల వయసులో పార్టీ రాష్ట్ర నాయకత్వంలో చేరారు.
అనారోగ్య కారణాలతో పార్టీకి మూడు నెలల సెలవులు పెట్టారు. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజేంద్రన్ త్వరలోనే తిరిగి వస్తారని అందరూ భావించారు. అందుకే ఆయన స్థానంలో మరొకరిని నియమించరాదని ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. రాజేంద్రన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కూడా తాను త్వరలోనే తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నేడు కొలువుదీరనున్న తెలంగాణ కొత్త అసెంబ్లీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు..
రాజేంద్రన్ మృతదేహాన్ని శనివారం ఉదయం తిరువనంతపురానికి తరలించి, అక్కడ ఎడప్జాన్జీలోని ఆయన కుమారుడి నివాసంలో, పట్టోమ్లోని పీఎస్ మెమోరియల్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అంతిమయాత్రలో కొట్టాయంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకెళ్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన కనం ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సతీశన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.