కరీంనగర్‌ మహాకూటమి సీట్ల లెక్క ఏంటీ..? ఏ సీటు ఎవరికీ..?

By sivanagaprasad kodatiFirst Published Oct 26, 2018, 1:07 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన మహాకూటమిలో సీట్ల చిక్కుముడి మెల్లగా వీడుతోంది. మిత్రుల కోసం అవసరమైతే సీట్లు వదులుకుంటానని టీడీపీ అధినేత ప్రకటించడం.. మిగిలిన పార్టీలు కూడా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించడంతో సీట్ల లెక్క ఓ దారికి వస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన మహాకూటమిలో సీట్ల చిక్కుముడి మెల్లగా వీడుతోంది. మిత్రుల కోసం అవసరమైతే సీట్లు వదులుకుంటానని టీడీపీ అధినేత ప్రకటించడం.. మిగిలిన పార్టీలు కూడా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించడంతో సీట్ల లెక్క ఓ దారికి వస్తోంది.

ఈ నేపథ్యంలో మహాకూటమికి పట్టున్న కరీంనగర్ జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయంలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయా స్థానాల సంఖ్య తేలుతుందనే వార్తలు రావడంతో.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు..? సీట్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేస్తారు..? అన్న చర్చ  కూటమిలోని పార్టీల మధ్య జోరుగా సాగుతోంది.

మొత్తం 13 నియోజకవర్గాలున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించే అవకాశం ఉంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. హస్తం 10 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లకు ఒక్కో స్థానం ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కూటమిలో సీట్ల సర్దుబాటు ఆధారంగా టీడీపీకి కోరుట్ల, టీజేఎస్‌కు రామగుండం, సీపీఐకి హుస్నాబాద్ దక్కుతాయని అంటున్నారు. ఇక రీంనగర్‌, మంథని, చొప్పదండి, హుజురాబాద్‌, పెద్దపల్లి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్‌, జగిత్యాల, ధర్మపురి స్థానాలను కాంగ్రెస్ వదులుకునే అవకాశం లేదు. 

మరోవైపు టీజేఎస్‌కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న రామగుండం స్థానంపైనా కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతలు కన్నేయడంతో అది కూడా హస్తానికి దక్కేలా చేయాలని కొందరు పావులు కదుపుతున్నారు. హుస్నాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తానని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు. 

అయితే ఈ స్థానంపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి హుస్నాబాద్ ఎట్టి పరిస్థితుల్లో తనకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. కోరుట్ల స్థానంలో మొదట పోటీ చేయనని ప్రకటించిన తెలుగుదేశం.. చివరి నిమిషంలో ఓకే చెప్పడంతో ఇక్కడ టెన్షన్ పెరిగిపోతోంది.

టీఆర్ఎస్, బీజేపీ, బీఎల్ఎఫ్ కూటమి ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఆయా పార్టీల అభ్యర్థులు గ్రామాలతో పాటు కొన్ని మండలాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా జరగకపోవడంతో ఎవరికి వారు ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు 2019 ఎన్నికల్లో ఆయా సీట్లు తమకే వస్తాయని విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిన నేతలు.. ఇప్పుడు తమ భవిష్యుత్తు డైలమాలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడే వరకు మౌనంగా ఉండటమే బెటర్ అని వారు భావిస్తున్నారు. మొత్మం మీద ఏ ఏ స్థానాలు ఎవరికి ఇస్తారనే ప్రకటన వెలువడితే కానీ ఉత్కంఠకు తెరపడదు. 

తోటి అభ్యర్థులపై నిఘా.. కరీంనగర్‌లో గూఢచారుల సంచారం

click me!