బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు.
బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. 25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం..అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే తనకు ఇస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ఏనాడూ ఏ పదవి కోరుకోలేదని.. ఇప్పటికీ అనుకోవడం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం ఒకటి ఉందని అన్నారు.
‘‘నాడు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదు... నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు.రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం’’ అని విజయశాంతి తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న విజయశాంతి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. బీజేపీ తన సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదని భావనలో ఉన్న విజయశాంతి.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీజేపీ అధిష్టానం.. టీ బీజేపీ నిరసనల కమిటీ చైర్మన్ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే విజయశాంతి తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.