కేసీఆర్‌కు సర్దార్‌ షాక్‌.. టీఆర్ఎస్‌కు రవీందర్‌ సింగ్‌ రాజీనామా, ఎన్నోసార్లు మాట తప్పారంటూ లేఖ

By Siva KodatiFirst Published Nov 25, 2021, 9:37 PM IST
Highlights

అనుకున్నదే అయింది. టీఆర్‌ఎస్‌కు (trs) మరో సీనియర్‌ నేత రాజీనామా చేశారు. కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) గులాబీ గూటి నుంచి బయటకు వచ్చేశారు. ఈమేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు (kcr) ఆయన గురువారం రాజీనామా లేఖను పంపారు. 

అనుకున్నదే అయింది. టీఆర్‌ఎస్‌కు (trs) మరో సీనియర్‌ నేత రాజీనామా చేశారు. కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) గులాబీ గూటి నుంచి బయటకు వచ్చేశారు. ఈమేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు (kcr) ఆయన గురువారం రాజీనామా లేఖను పంపారు. ఎమ్మెల్సీ టిక్కెట్ల విషయమే రవీందర్‌ సింగ్‌ రిజైన్‌కు కారణంగా తెలుస్తోంది. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన ఆయన భంగపడ్డారు. దీంతో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆయన్ను బుజ్జగించేందుకు హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నించింది. నామినేషన్ వెనక్కి తీసుకుని పోటీనుండి తప్పుకునేలా రవీందర్ సింగ్ ను ఒప్పించేందుకు సీనియర్లు సైతం రంగంలోకి దిగారు. కానీ.. ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెబుతారని మీడియాలో కథనాలు వచ్చాయి. చివరికి అదే నిజమైంది.

“టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి అధిష్టానం ఏది చెబితే అదే చేశా.. ఎమ్మెల్సీని చేస్తానని మాట ఇచ్చి తప్పారు. ఇలా చాలాసార్లు జరిగింది. కనీసం మిమ్మల్ని కలుద్దామని అనుకున్నా మీరు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడం లేదు” అంటూ రాజీనామా పత్రంలో కేసీఆర్‌ను తీవ్రంగా ప్రశ్నించారు  రవీందర్ సింగ్.

Also Read:టీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా... రాజీనామా యోచనలో రవీందర్ సింగ్? ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో

ఇలా రవీందర్ సింగ్ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ పెద్దలను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికల్లో (huzurabad bypoll) ఎదురుదెబ్బ తగలడంతో నష్టనివారణ చర్యలు చేపడుతున్న అధికార పార్టీకి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవగా స్థానికసంస్థల కోటాలో కూడా ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులే అత్యధికంగా వున్నారు. 

ఇలా స్ఫష్టమైన ఆధిక్యం వుంది కాబట్టి గెలుపు తమదేనని ధీమాతో వున్న అధికార పార్టీకి ప్రజాప్రతినిధులు సరికొత్త తలనొప్పిని తెచ్చి పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ పార్టీ.. క్యాంప్ రాజకీయాలను ప్రారంభించింది. తమకు సరైన నిధులు, ప్రాతినిధ్యం, ప్రాధాన్య లభించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

 

 

 

click me!