మహబూబ్‌నగర్ టికెట్ కోసం సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు.. సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ!

Published : Sep 05, 2023, 07:27 PM IST
మహబూబ్‌నగర్ టికెట్ కోసం సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు.. సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ!

సారాంశం

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం సంజీవ్ ముదిరాజ్ దరఖాస్తు చేసి తన ప్రయత్నాలు షురూ చేశారు. నియోజకవర్గంలో మంచిపేరున్న, వివాదరహితుడైన, కాంగ్రెస్ వాది సంజీవ్‌కే టికెట్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.  

హైదరాబాద్: మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనపట్ల సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సీనియర్ లీడర్, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్‌ బరిలో నిలబడితే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. సంజీవ్ ముదిరాజ్‌కు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు హస్తం పార్టీని డిమాండ్ చేస్తున్నారు. 

సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్‌వాదిగా పేరు సంపాదించుకున్నారు. కష్టకాలంలోనూ పార్టీ జెండాను విడువలేదు. వివాదరహితుడిగా పేరున్న సంజీవ్ బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 50 వేల మేరకు ముదిరాజ్‌ల ఓట్లు ఉన్నట్టు అంచనా. పాలమూరులో కాంగ్రెస్ పార్టీ దశాబ్దానికిపైగా అధికారానికి దూరంగా ఉండటంతో మంచిపేరున్న సంజీవ్ ముదిరాజ్‌ను బరిలో నిలబెడితే ఆయనను గెలిపించుకుంటామని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర పీసీసీ నేతలు కూడా ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. పలు సర్వేల్లో సంజీవ్‌కు అనుకూల ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ సంజీవ్ ముదిరాజ్‌కే దక్కుతుందని అభిమానులు చెబుతున్నారు.

Also Read: కార్లు అద్దెకు తీసుకుని వేరే రాష్ట్రాల్లో అమ్మకం.. హైదరాబాద్‌లో ఘరానా మోసగాడి అరెస్టు

మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేత నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రెండు సార్లు మహబూబ్ నగర్ నుంచి గెలిచారు. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్‌లోనూ ఉన్నారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ టికెట్ ఆయనకే కన్ఫమ్ అయింది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ వేటు వేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉన్నది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?