కార్లు అద్దెకు తీసుకుని వేరే రాష్ట్రాల్లో అమ్మేస్తున్న ఓ ఘరానా మోసగాడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ కార్లు అద్దెకు తీసుకుని వేరే రాష్ట్రాల్లో అమ్మేసుకుంటున్న దొంగను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 1.20 కోటి విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సనత్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ అస్లం నవాజ్ కార్లను అద్దెకు తీసుకుని బిజినెస్ చేస్తాడు. పలువురి నుంచి కార్లు తీసుకుని మొదటి రెండు మూడు నెలలు క్రమం తప్పకుండా కార్లకు అద్దె వారికి అందిస్తాడు. దీంతో ఆ కార్ల యజమానులు మొహమ్మద్ అస్లం నవాజ్ పై నమ్మకం పెంచుకుంటారు. యజమాని నమ్మిన తర్వాత ఆ కార్లను వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లేవాడు. అక్కడే కార్లను అమ్మేసేవాడు. ఇంకొన్ని రోజులకు కార్ల యజమానులు అతడిని అద్దె గురించి లేదా కార్ల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకునేవాడు. వేరే రాష్ట్రాలకు పారిపోయేవాడు.
Also Read: చర్చిల ధ్వంసం, 400 ఇళ్లకు నిప్పు.. పట్టించుకోని ప్రభుత్వం : పాక్‌లో క్రైస్తవుల కన్నీటి వ్యథ (వీడియో)
ఈ కేసుల్లో మొహమ్మద్ అస్లం నవాజ్ గతంలోనే కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అయినా.. ఆయన నేరప్రవృత్తిని వీడలేదు.
మొహమ్మద్ అస్లం నవాజ్ చాంద్రాయణగుట్టలో ఉన్నట్టు చాంద్రాయణగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే మొహమ్మద్ అస్లం నవాజ్‌ను చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు వదద అదుపులోకి తీసుకున్నారు. కార్ల అమ్మకాల గురించి మొహమ్మద్ అస్లం నవాజ్‌ను ప్రశ్నించగా.. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతను అమ్మేసిన కార్ల వివరాలనూ పోలీసులకు తెలిపాడు. అలాగే.. పోలీసులు ఆయన వద్ద నుంచి 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు.