బచ్చాగానివి.. పీసీసీ పోస్ట్ దిగితే, నీ విలువేంటీ.. ఎవర్నీ బండకేసి కొడతావ్ : రేవంత్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Jul 2, 2022, 6:46 PM IST
Highlights

బండకేసి కొడతానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి .. మేమేమైనా పాలేర్లమా అంటూ ఫైరయ్యారు. టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు ఎలా అర్హుడయ్యావన్న జగ్గారెడ్డి .. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్ కు లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీహెచ్ వయసు ఎక్కడ..? నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నువ్వు పోరగానివి.. బండకేసి ఎవర్ని కొడతావంటూ ఆయన ప్రశ్నించారు. పీసీసీ పోస్ట్ దిగి చూస్తే.. నీకేం విలువ వుంటుందని జగ్గారెడ్డి నిలదీశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంతకుముందు నిరుద్యోగుల ఆశలపై మోడీ నీళ్లు చల్లారని మండిపడ్డారు జగ్గారెడ్డి (jagga reddy) .  హైదరాబాద్ లో మోడీ పర్యటన (narendra modi) నేపథ్యంలో శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ డ్రామా పార్టీ అయిపోయిందన్నారు. మళ్లీ భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్తామంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి గుడికి తాను కూడా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుడిలో భజన చేస్తానంటూ జగ్గారెడ్డి తెలిపారు. అగ్నిపథ్‌లో (agnipath) నాలుగేళ్లే ఉద్యోగం అని చెబుతోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతలకు జ్ఞానోదయం కలిగించమని అమ్మవారిని ప్రార్ధిస్తామని జగ్గారెడ్డి చురకలు వేశారు. అలాగే మంచి పాలన అందించేలా బీజేపీ నేతలకు బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు. 

Also Read:భాగ్యలక్ష్మీ ఆలయానికి నేనూ వస్తా.. మీ కోసం భజన చేస్తా : బీజేపీకి జగ్గారెడ్డి చురకలు

మరోవైపు.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (yashwant sinha) హైదరాబాద్ టూర్  తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సహా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు మద్దతు పలికాయి. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇతర పక్షాలతో కలిసి ఆ కార్యక్రమంలో వేదిక పంచుకున్న వారు పలకరించుకున్న సందర్భం లేదు. 

అయితే తెలంగాణకు వచ్చే సరికి ఆ పరిణామాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి  ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న యశ్వంత్ సిన్హాకు భేటీపై టీ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే పీసీపీ మాత్రం యశ్వంత్ సిన్హాతో భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని టీపీసీసీ ఆలోచన చేస్తుంది. 

click me!