Medaram Mahajathara: మేడారం జాతరకు ఆర్టీసీ సర్వం సిద్ధం

By Rajesh KFirst Published Jan 22, 2022, 4:48 PM IST
Highlights

Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ క్ర‌మంలో ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌ప‌డానికి సిద్ద‌మైంది.మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
 

Medaram Sammakka Saralamma Mahajathara: ఆసియాలోనే అతి పెద్ద జాత‌ర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర.  ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం నిర్ణయించింది. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జాతర జరగనుండడంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

 ఈ జాత‌ర‌కు కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు ఇంకా సమయం మున్న‌దున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టీఎస్ ఆర్టీసీ కూడా  ఏర్పాట్లు చేసింది. 
మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సుల‌ను నడిపించ‌డానికి  సిద్ధమైంది. మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రత్యేక సర్వీసులు న‌డ‌ప‌నున్న‌ది. ఉదయం 7గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరుతాయి. ప్ర‌తిరోజు సాయంత్రం 4గంటలకు మేడారం నుంచి హన్మకొండకు వస్తాయి.  హన్మకొండ నుంచి మేడారం ప్ర‌యాణీకుల‌కు పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 ఛార్జీలుగా టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ జాతర కోసం దాదాపు  3,835 బస్సు సర్వీసులను నడపనున్నారు. అలాగే.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 51 బస్సు పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇందు కోసం 12,267 మంది సిబ్బంది సేవలను ఆర్టీసీ వినియోగించుకోనుంది.

 అలాగే.. హైదరాబాద్ నుంచి కూడా మేడారం వరకు ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌పాల‌ని భావిస్తోంది.  అయితే అడ్వాన్స్ బుకింగ్ విషయమై ఇంకా స్పష్టత లేదు. తిరుగు ప్రయాణంలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండకపోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

మహారాష్ట్రలోని సిరోంచ నుంచి కాళేశ్వరం మీదుగా.. మేడారం వరకు అంతర్రాష్ట్ర సర్వీసులను సైతం ఆర్టీసీ న‌డ‌పడానికి సిద్ధంగా ఉంది.  అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా బస్సులు నడుపనున్నాయి. 

ఉమ్మడి వరంగల్ నుంచి  మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు హన్మకొండ డిపో మేనేజర్ తెలిపారు. దాదాపు 30 మంది బృందంగా జాతరకు వెళ్లాల‌ని భావించే వారు త‌మ‌ను సంప్ర‌దించాల‌ని భావించారు. ఇందుకోసం సెల్:9949857692లో ముందుగా తెలియజేస్తే.. ప్రత్యేక బస్సులు మీరు ఉన్న చోటుకే వచ్చి ఎక్కించుకుంటారని ఆయన తెలిపారు.

అలాగే.. కరోనాను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ సిబ్బందికి 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు. డిపో నుంచి బయల్దేరే బస్సులను శానిటైజ్ చేయనున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి సూచిస్తుంది. మాస్క్ త‌ప్పనిసరిగా ధ‌రించాల‌ని  సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులు సైతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి సూచిస్తుంది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జరిగే..  సమ్మక్క సారలమ్మజాత‌ర‌లో ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె పైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుంది.  

click me!