విధులకు అనుమతించడం లేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..!

By telugu news teamFirst Published Jun 30, 2021, 8:32 AM IST
Highlights

అనుమతి లేకుండా రెండ్రోజులు గైర్హాజరైనందుకు డిపో సీఐ విజయ్ కుమార్ వద్దకు వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున మరోసారి వెళ్లి కోరారు.

విధులకు అనుమతించడం లేదని మనస్తాపానికి గురై ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బన్సీలాల్ పేట లో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తుర్కయాంజాల్ ప్రాంతానికి చెందిన తిరుపతి రెడ్డి(52) హైదరాబాద్ లోని రాణిగంజ్-1 బస్ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ.. డిపోలోని రెస్ట్ రూంలోనే ఉంటున్నారు.

ఈ నెల 12 నుంచి 22 వరకు సిక్ లీవ్ తీసుకున్నారు. 23, 24 తేదీల్లోనూ విధులకు హాజరవ్వకుండా.. 25న డిపోకు వెళ్లారు. అనుమతి లేకుండా రెండ్రోజులు గైర్హాజరైనందుకు డిపో సీఐ విజయ్ కుమార్ వద్దకు వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున మరోసారి వెళ్లి కోరారు.

నిరాకరించడంతో.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిపడిపోయాడు. హుటాహుటిన తోటి ఉద్యోగులు, అక్కడే ఉన్న ఓ అధికారి.. బస్సులోనే గాంధీకి, అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.  అయితే... అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

విధులకు అనుమతితంచలేదనే కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపోలో అధికారులు వేధిస్తున్నారని... విధులకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించడం లేదని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి తీసుకొని బంధువుల అంత్యక్రియలకు వెళ్లినా.. మృతదేహం వద్ద నిల్చొని ఫోటో తీసుకొని పంపాలని వేధిస్తున్నారని ఆరోపించారు. 

click me!