సుపారీ కిల్లర్ విజయవాడ బిట్టు: ప్రేయసిని హత్య చేసేందుకు జతకట్టిన సుబ్బు

By telugu teamFirst Published Jun 30, 2021, 8:08 AM IST
Highlights

మంచిర్యాలలో విజయలక్ష్మి అనే మహిళను, ఆమె కూతురిని హత్య చేసిన నిందితుల విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బిట్టు, సుబ్బుల గురించి పోలీసులు విస్తుపోయే విషయాలను గుర్తించారు.

మంచిర్యాల: తెలంగాణలోని మంచిర్యాల బృందావన్ కాలనీలో జరిగిన జంట హత్య కేసు నిందితుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నెల 18వ తేదీన విజయలక్ష్మిని, ఆమె కూతురు రవీనాను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసిన విషయం తెలిసింది. అరుణ్ కుమార్ తన భార్య రవీనాను, అత్త విజయలక్ష్మిని హత్య చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఆన్ లైన్ లో సంప్రదించాడు. 

ఆ కిరాయి హంతకులు బిట్టు, సుబ్బుల గురించి ఆసక్తికరమైన విషయాలను పోలీసులు కనిపెట్టారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ మంగళవారం అందుకు సంబంధించిన వివరాలను అందించారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన జుజ్వరపు రోశయ్య అలియాస్ బిట్టు డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ యువతిని ప్రేమపెళ్లి చేసుకున్నాడు. అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. 

ఆయుధాలు అమ్ముతామనే మెసేజ్ ను యూట్యూబ్ లో చూసిన బిట్టు రూ. 30 వేలకు గన్ కొనేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని గన్ ఇవ్వలేదు. అతని చేతిలో మోసపోయిన బిట్టు అదే తరహాలో తాను మోసాలకు పాల్పడవచ్చునని భావించాడు. 

Also Read: అత్తభార్యల జంట హత్యల కేసు: యూట్యూబ్ లో సుపారీ కిల్లర్ ను కనిపెట్టి...

దాంతో ఆన్ లైన్ లో గన్ ఫర్ సేల్ అని పెట్టి తన ఫోన్ నెంబర్ ఇస్తూ వచ్చాడు. ఇటీవల సుపారీ కిల్లర్ విజయవాడ అనే ఐడిని రూపొందించి ఆయుధాలు అమ్ముతామని, అవసరమైతే సుపారీ తీసుకుని హత్యలు చేస్తాం, కిడ్పాప్ లు చేస్తామని ప్రకటించాడు. అది చూసి అరుణ్ కుమార్ తన అత్తను, భార్యను చంపడానికి అతన్ని సంప్రదించాడు.

కాగా, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకట సుబ్బారావు అలియాస్ సుబ్బు తనతో వివాహేతర సంబంధం పెట్టుకు్న మహిళను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆన్ లైన్ లో బిట్టును సంప్రదించాడు. దానికి రూ. 2 లక్షలు కావాలని బిట్టు అతనికి చెప్పాడు. తన వద్ద అంత మొత్తం లేదని సుబ్బు చెప్పాడు. దానికింద మంచిర్యాల జంట హత్యలకు బిట్టుకు సహాయం చేసేందుకు సుబ్బు అంగీకరించాడు. 

హత్యలు చేసేందుకు ఆ ఇద్దరు మంచిర్యాల చేరుకోగా, వారిని అరుణ్ కుమార్ కలిశాడు. ముగ్గురు కలిసి ఈ నెల 18వ తేదీన విజయలక్ష్మిని, రవీనాను చంపారు. అరుణ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు అతనిచ్చిన సమాచారంతో విజయవాడ వెళ్లి బిట్టును, సుబ్బును అరెస్టు చేశారు.

click me!