Peddapalli Bus Accident: ఆర్టిసి బస్సు-లారీ ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు (Video)

By Arun Kumar PFirst Published Dec 15, 2021, 4:54 PM IST
Highlights

ఆర్టిసి బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో పెద్దపల్లి జిల్లా సుల్తాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా మరో పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. 

పెద్దపల్లి జిల్లా (peddapalli district)లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంథని నుండి కరీంనగర్ కు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టిసి బస్సు (RTC Bus) సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద లారీ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మరో పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. 

ప్రమాదానికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంథని ఆర్టిసి డిపో (manthani rtc depot)కు చెందిన బస్సు ప్రయాణికులతో కరీంనగర్ కు బయలుదేరింది. ఈ క్రమంలో సుల్తానాబాద్ (sulthanabad) కు చేరుకున్న బస్సు బస్టాండ్ లోంచి రాజీవ్ రహదారికి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును ఢీకొట్టింది. 

Video

లారీ బస్సుకు వెనకవైపు ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో పదిమంది స్వల్పంగా గాయపడ్డారు.  

read more  West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాగే ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయి తొమ్మిదిమంది బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 47మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జల్లేరు వద్ద ప్రమాదానికి గురయ్యింది. జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది.  

వంతెనపై నుండి పడటంతో గాయాలై కొందరు, నీటిలోమునిగి ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు వున్నారు. ఇలా ఇప్పటికే బస్సు డ్రైవర్ సహా తొమ్మిదిమంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

జల్లేరు వాగుపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు వాగులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటనాస్థలిలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

read more  పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: తొమ్మిది మంది మృతి

క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

బస్సు కింది బాగంలో కూడా ప్రయాణీకులు ఉండి ఉండొచ్చనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పడవల సహాయంతో ఒడ్డుకు చేర్చిన వెంటనే హాస్పిటల్ కు తరలిస్తున్నారు. 
 

   
 

click me!