హైదరాబాద్ లోని పలు పబ్లిక్ పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్న జంటలపై షీ టీమ్ ఫోకస్ పెట్టింది. అలాంటి చర్యలకు పాల్పడుతున్న పలు జంటలను శుక్రవారం పట్టుకుంది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫైన్ వేసి పంపించాయి.
హైదరాబాద్ లోని పలు పబ్లిక్ పార్కులకు చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సాయంత్రం సమయంలో సేద తీరేందుకు, ఫ్యామిలీతో, చిన్నారులతో సరదాగా గడిపేందుకు వెళ్తున్న చాలా మందికి అక్కడి జంటలు చేస్తున్న పనులు ఇబ్బందికరంగా మారాయి. తమను ఎవరు చూస్తారులే అనే ధైర్యమో లేక ఎవరు చూసినా ఏం పర్లేదులే అనే తెగింపో తెలియదు గానీ.. యువ జంటలు పార్కుల్లో రెచ్చిపోతున్నాయి.
బెంచీల మీద కూర్చుంటూ, పొదల సమీపంలో పబ్లిక్ గానే కిస్సులు, హగ్గులతో రొమాన్స్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందిరా పార్క్, కృష్ణకాంత్‌పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలో ఇలాంటి దృష్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆ ప్రేమ మైకంలో తేలిపోతున్న జంటలకు మామూలు విషయంలాగే కనిపిస్తాయి కానీ చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల కంట పడితే వారికి లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది.
undefined
కాలేజీ పూర్తయిన తరువాత కాస్తా రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువకులు కూడా దీని వల్ల పెడదారిన పడే ప్రమాదం ఉంది. ఆఫీసుల్లో పనులు పూర్తి చేసుకొని వాకింగ్ వచ్చే పెద్ద వారికి కూడా ఇది కాస్త ఇబ్బంది కగిలించే విషయమే. అయితే దీనిని కట్టడి చేసేందుకు గతంలో ఇందిరా పార్క్ యాజమాన్యం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అది వివాదంగా మారింది. పార్కులో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు 2021 ఆగస్టులో ‘పెళ్లి కాని జంటకు ప్రవేశం లేదు’ అని పార్క్ బయట యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదంగా మారడంతో దానిని వెనక్కి తీసుకుంది.
ఇక అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు తమ ప్రేమ కలాపాలు సాగిస్తూనే ఉన్నాయి. దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగాయి. పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నాయి. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ తో పాటు పలు పబ్లిక్ ప్లేసుల్లో జంటలను షీ టీమ్ పట్టుకుంది.
ఇంకో సారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి, ఫైన్ వేసి పంపించాయి. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇక నుంచి తమ నిఘా ఉంటుందని షీ టీమ్ అధికారులు వెల్లడించారు.