తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి, 9మందికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Nov 12, 2022, 10:52 AM IST
Highlights

తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 9మంది గాయపడ్డారు. 

హైదరాబాద్ : తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు, ఒక యువతి మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం గ్రామీణ మండలంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఖమ్మం గ్రామీణ మండలం కల్లంపాడు వద్ద కరీంనగర్ నుంచి భద్రాచలం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందిత (16) మృతి చెందగా.. కార్ డ్రైవర్తో పాటు కారులో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు బాధితులు హైదరాబాద్కు చెందిన గోళ్ళ నందిత (16),కళ్యాణి, మౌనిక, సుదీక్ష.. కర్నూలుకు చెందిన కానాల శంకర్ రెడ్డి, లక్ష్మి, కానాల వెంకటనారాయణరెడ్డి (కారు డ్రైవర్), కడపకు చెందిన పందిళ్లపల్లి యశస్విగా పోలీసులు గుర్తించారు. 

తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న మోదీ పర్యటన.. కూనంనేనితో పాటు పలువురు వామపక్ష నేతల అరెస్ట్..

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో శనిగరం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  కమలాపూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన చుక్కా అజయ్ (24), అన్నం నాగార్జున రెడ్డి (32)లతో పాటు మరో ముగ్గురు శనిగరం నుంచి నడికూడ మండలానికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరందరూ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ముందుగా వెడుతున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న కమలాపూర్ సీఐ సంజీవ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

click me!