
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు మొత్తంగా రూ.9500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ మొదట పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండంకు హెలికాఫ్టర్‌లో చేరుకోనున్నారు. అక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను(ఆర్ఎఫ్‌సీఎల్) జాతికి అంకితం చేయనున్నారు.
ఆర్ఎఫ్‌సీఎల్‌ను సందర్శించిన అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ.. ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
అయితే ప్రధాని మోదీ పర్యటనకు ఈసారి కూడా సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోదీకి స్వాగతం, వీడ్కోలు పలకనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొనాలని మాత్రమే లేఖ పంపారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందువల్లే సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర ఎరువులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సత్సబంధాలు దెబ్బతిన్న తర్వాత ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా రామగుండంలో భారీగా భద్రత ఏర్పాట్లను చేశారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం, పోలీసు శాఖ సమన్వయంతో జిల్లా యంత్రాంగం మోదీ పర్యటన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యాత్రను అడ్డుకోవాలని పలు జాతీయ కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రామగుండం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరుగురు ఎస్పీలు, ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలు, 31 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 229 మంది ఎస్‌ఐలు, 400 మంది ఏఎస్‌ఐలు, 1,178 మంది కానిస్టేబుళ్లు, 102 మంది హోంగార్డులతో పాటు 2,500 మంది పోలీసు సిబ్బందిని భద్రత ఏర్పాట్ల కోసం వినియోగిస్తున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వచ్చే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున సభా వేదిక వద్దకు వెళ్లేవారు ముందుగానే వెళ్లాలని సూచించారు. ప్రజలు ఎన్‌టీపీసీ బి గేట్ ద్వారా ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లోకి ప్రవేశించాలని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన వాహన పాస్‌లు ఉన్న వ్యక్తులను ఎన్టీపీసీ ఏ గేట్ ద్వారా అనుమతించనున్నట్టుగా చెప్పారు.