తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న మోదీ పర్యటన.. కూనంనేనితో పాటు పలువురు వామపక్ష నేతల అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Nov 12, 2022, 10:06 AM IST
Highlights

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కాక రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం, సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపడం, ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. 

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కాక రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం, సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపడం, ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు వామపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పెద్దపల్లి  జిల్లా రామగుండం, గోదావరిఖనిలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ నేత సీతరామయ్యతో పాటు పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రజా సంఘాలు, బొగ్గుగని  కార్మిక సంఘం నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. 

మంచిర్యాల జిల్లాలో కూడా పలువురు వామపక్ష నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొందరిని గృహ నిర్బంధం చేశారు. అరెస్ట్ చేసిన వామపక్ష నేతలను మంచిర్యాల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు రామగుండంలో కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో పలుచోట్ల టీబీజీకేఎస్, ఇతర కార్మిక సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు మొత్తంగా రూ.9500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ మొదట పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండంకు హెలికాఫ్టర్‌లో చేరుకోనున్నారు. అక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను(ఆర్ఎఫ్‌సీఎల్) జాతికి అంకితం చేయనున్నారు. 

ఆర్ఎఫ్‌సీఎల్‌ను సందర్శించిన అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ.. ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

click me!