
కామారెడ్డి జిల్లాలో (kamareddy district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి గేటు (hasanpalli gate) సమీపంలో ఈ దారుణం జరిగింది. పిట్ల మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన కొందరు ఎల్లారెడ్డి సంతకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని డ్రైవర్ సాయిలు, లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్యలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా వున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.