సిద్దిపేట జిల్లాలో ఘోరం... వరికుప్పను ఢీకొని యువకుడు మృతి, ప్రాణాపాయస్థితిలో మరొకరు

By Arun Kumar PFirst Published Nov 22, 2021, 10:22 AM IST
Highlights

రోడ్డుపై పోసిన వరికుప్పను వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృత్యువాతపడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.  

సిద్దిపేట: కొందరు రైతులు స్థలాభావం వల్ల పండించిన ధాన్యాన్ని రోడ్లపై పోసి నూర్పిడి చేయడం, ఆరబెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే నిత్యం వాహనాలు తిరిగే రోడ్లపై ధాన్యాన్ని నూర్పిడిచేయడం ప్రమాదాలకు కారణం అవుతోంది. తాజాగా ఇలా ధాన్యం కుప్పలను రోడ్డుపైనే వుంచడంతో రాత్రి సమయంలో దాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృత్యువాతపడిన దారుణం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ road accident కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. dubbaka mandal ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన బంధువయిన దానయ్యతో కలిసి ఆదివారం బైక్ పై వెళుతుండగా మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో ప్రమాదం జరిగింది. 

రోడ్డుపైనే వరిపంటను నూర్పిడి చేసిన ఓ రైతు వడ్లను అదే రోడ్డుపై ఓపక్కగా పోసాడు. దానిపై నల్లటి పాలిథిన్ కవర్ కప్పారు. అయితే రాత్రి ఈ రోడ్డుపైనే వేగంగా వెళుతున్న ప్రభు చీకట్లో వరికుప్పను గమనించలేదు. దీంతో వేగంగా వెళ్ళి వరికుప్పను ఢీకొట్టడంతో బైక్ తో సహా ప్రభు, దానయ్య అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో ప్రభు తల బలంగా రోడ్డును గుద్దుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దానయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

READ MORE  Road Accident: షాద్ నగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఓవర్ స్పీడ్‌తో రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ప్రాణాపాయ స్థితిలో గాయాలతో పడివున్న దానయ్యను హాస్పిటల్ కు తరలించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకుని ప్రభు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

రోడ్డుపై వున్న వరికుప్ప వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చేస్తున్నారు. అయితే రోడ్లకు అడ్డంగా ధాన్యాన్ని నూర్పిడి చేయడం ఇలా ప్రమాదాలకు కారణమవుతోందని... కాబట్టి అధికారులు వెంటనే రైతులకు ప్రత్యామ్నాయాలు చూపించి రోడ్లపైకి ధాన్యాన్ని తేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇక తాజా ప్రమాదంలో మృతిచెందిన ప్రభుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇంటికి పెద్దదిక్కయిన ప్రభు మృతితో ఆ కుటుంబం రోడ్డునపడినట్లే. భర్త ప్రభు మృతదేహం వద్ద భార్య రాధ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య యుద్దవాతావరణం నెలకొంది. తెలంగాణ రైతాంగం పండిచిన వరి ధాన్యాన్ని కొనాల్సింది మీరంటే మీరని అధికార టీఆర్ఎస్, తెలంగాణ బిజెపి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. వారి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో ఇలా రోడ్లపైనే వడ్లను దాచాల్సిన పరిస్థితి  ఏర్పడింది.

అయితే రైతులు రోడ్లపై నిల్వవుంచిన ధాన్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల నుండి పంటను సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. వరి కొనుగోలు విషయంలో తొందరగా తేల్చాలని రైతులు కోరుతున్నారు.


 
 

click me!