
పంచ్ డైలాగులకు పెట్టింది పేరు అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన నాటినుంచి మౌనదీక్షలో ఉన్నట్లు కనబడుతున్నది. కాంగ్రెస్ మార్కు రాజకీయాలను ఒంటపట్టించుకోవాలంటే ఆయనకు కొద్దిగా టైం పట్టేలా ఉందా? లేక గతంలో మాదిరిగా దూకుడుగా వెళ్లకూడదని నిర్ణయించున్నరా? గతంలో అస్తమానం ఆయన ఒక్కడే కేసిఆర్ ప్రభుత్వంపై, టిఆర్ఎస్ పార్టీపై కేసిఆర్ ఫ్యామిలీపై వన్ సైడ్ బ్యాటింగ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. రేవంత్ సవాళ్లకు అధికార పార్టీ కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. అయినా ఆయన బ్యాటింగ్ ఆపలేని సందర్భాలున్నాయి. కానీ ఉన్నట్లుండి నాలుగైదు రోజులుగా రేవంత్ రెడ్డి గప్ చుప్ అయిండు. ఎక్కడా ఆయన మాటలేదు. పలుకు లేదు. ఎందుకోసం ఆయన సైలెంట్ అయిండు? ఎప్పటి వరకు ఈ మౌనదీక్ష అన్నదానిపై ప్రత్యేక కథనం.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఢిల్లీలో ఎఐసిసి కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. తర్వాత బయటకొచ్చిన తర్వాత కూడా టివిల ముందు మాట్లాడారు. అది తప్ప ఇప్పటివరకు ఆయన నోరు తెరవలేదు. పైపెచ్చు ఆయన మీద తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. రేవంత్ దొంగ అంటూ కామెంట్లు చేశారు. ఈ విషయంలోనూ రేవంత్ బయటకొచ్చి ఏం మాట్లాడలేదు. అయితే ట్విట్టర్ ద్వారా కేటిఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వేలకోట్లు దిగమింగిన సత్యం రామలింగరాజు కొడుకుతో కేటిఆర్ దోస్తాన్ ఎందుకబ్బా అని ఒక ఫొటో ట్విట్టర్ లో పెట్టి రియాక్ట్ అయ్యారు. అయితే మీడియా ముందుకు మాత్రం రాలేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఈనెల 8వ తేదీ వరకు ఈ మౌనదీక్షను కంటిన్యూ చేస్తారట. ఈనెల 8వ తేదీన కోస్గి లో భారీ సభ ఏర్పాటు చేసుకున్నారని ఆ సభలో రేవంత్ అన్ని విషయాల మీద మరోసారి మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరేముందు కూడా రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఆ తర్వాతే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇక ఇప్పుడు కూడా తాను కాంగ్రెస్ పార్టీలో తన కార్యాచరణ ప్రారంభించేముందు తన అధిష్టానమైన కొడంగల్ లోనే సభ పెట్టి ముందుకు కదులుతాడని రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఒకరు ఏషియానెట్ కు తెలిపారు. మొత్తానికి 8వ తేదీ వరకు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. తన రాజీనామా ఆమోదం సబ్జెక్టుతోపాటు ఒకవేళ కొడంగల్ ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహం అనుసరించాలి, కాంగ్రెస్ లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు అనే అంశాలన్నింటిపైనా రేవంత్ గొంతు విప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
తిరుమల స్వామివారిని దర్శించుకున్న జగన్ ఈ వార్తతోపాటు
మరిన్ని తాజా వార్తల కోసం కింద లింక్ మీద క్లిక్ చేయండి