
Hyderabad Bonalu : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పండగ బోనాలు. ఆషాడమాసం వచ్చిందంటే చాలు యావత్ తెలంగాణలో పూనకాలు లోడ్ అవుతాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో దాదాపు నెలరోజులు ఈ బోనాల సందడి ఉంటుంది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య తెలంగాణ ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వేటలను బలిచ్చి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విందు... మందేసే మగాళ్లు సరదా చిందులతో బోనాల పండగను ఆనందంగా జరుపుకుంటారు.
ఇలా తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల పండగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 26న అంటే వచ్చే గురువారం పురాతన గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. దీంతో నగరంలో బోనాల వేడుకలు ప్రారంభం అవుతాయి... తిరిగి జూలై 24న చివరి బోనంతో ముగుస్తాయి. మధ్యలో ప్రతి ఆదివారం నగరంలో ఒక్కోచోట బోనాల వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతాయి.
జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో జరిగే బోనాల వేడుకల కోసం ఇప్పటికే ప్రభుత్వ అన్నిఏర్పాట్లు చేసింది. బోనాల వేడుకలు సికింద్రాబాద్ మహంకాళి ఆలయంతో పాటు నగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ మొత్తం అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సిద్దమయ్యింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు బోనాల వేడుకల్లో పాల్గొననున్నారు. నగరంలోని వేరువేరు ఆలయాలలో అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇలా ఏ ఆలయం ఎవరు పట్టువస్త్రాలు సమర్పిస్తారో ప్రకటించారు.
అయితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనేది గత అసెంబ్లీ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమయ్యింది. దీంతో నగరంలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అయినా ఆ పార్టీలో ఆశించిన స్థాయిలో ఊపు రాలేదు. దీంతో బోనాల పండగ ద్వారా నగర ప్రజలకు దగ్గరవ్వాలనేది రేవంత్ సర్కార్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఈసారి బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని వేడుకల్లోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి తో సహా మంత్రులంతా నగరంలో జరిగే బోనాల వేడుకల్లో సందడి చేయనున్నారు.
గురువారం (జూన్ 26) ప్రారంభమయ్యే గోల్కొండ బోనాల వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొంంటారు. ఆమెతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లు పాల్గొంటారు. వీరు గొల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హైదరాబాద్ బోనాల వేడుకల్లో కీలకమైనవి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఈ ఆషాడమాసంలో మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి... వేలాదిమంది బోనమెత్తి మొక్కులు చెల్లించుకోగా లక్షలాదిమంది భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారతాయి. వచ్చే నెల రెండో ఆదివారం అంటే జూలై 13న సికింద్రాబాద్ బోనాలు జరగనున్నాయి.. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది దేవాదాయ శాఖ. మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు, ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాలు ఉత్సవకమిటీ, అర్చకులు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు. దీంతో ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించడానికి సిద్దమయ్యారు.
జూలై 13న సీఎం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఆలయానికి కుటుంబసమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకోనున్నారు సీఎం. ఇక బోనాల రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాజకీయ ప్రముఖులు చాలామంది దర్శించుకుంటారు.. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను ఆదేశించింది.
జూలై 1, 2025 బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం జరగనుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు ఈరోజు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇప్పటికే కల్యాణం, రథోత్సవం నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ బోనాల్లో లాల్ దర్వాజ బోనాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఈ ఏడాది జూలై 20న అంటే ఆషాడమాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల పండగ నిర్వహిస్తారు. ఈ ఓల్డ్ సిటీలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఆషాడమాసం చివరి ఆదివారం హైదరాబాద్ మొత్తం బోనాల పండగను జరుపుకుంటారు. కాబట్టి ఆరోజు మంత్రులు వివిధ ఆలయాలను సందర్శించి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇలా జూలై 20న ఎవరు ఏ ఆలయానికి వెళ్లనున్నారంటే...
5. శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం (ఉప్పల్ పరిధిలోని నాచారం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
6. శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం (కార్వాన్) - మంత్రి దామోదర రాజనర్సింహ
7. శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం (చార్మినార్) - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
8. శ్రీ అక్కన్న మాదన్న ఆలయం (హరి బౌలి) - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
9. శ్రీ కట్టమైసమ్మ ఆలయం (చిలకలగూడ, సికింద్రాబాద్) - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
10. శ్రీ నల్లపోచమ్మ ఆలయం (సబ్జిమండి) - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
11. ఖిలా మైసమ్మ ఆలయం (ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్) - మంత్రి సీతక్క
12. శ్రీ మహంకాళి ఆలయం (మీరాలంమండి) - మంత్రి జూపల్లి కృష్ణారావు
13. శ్రీ ముత్యాలమ్మ ఆలయం, (BHEL) - మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి
14. శ్రీ మహంకాళి ఆలయం (గౌలీపుర, శ్రీ భారతమాత కోట మైసమ్మ ఆలయం) - మంత్రి వాకిటి శ్రీహరి
15. శ్రీ జగదాంబ ఆలయం (సుల్తాన్ షాహి) - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
16. శ్రీ మహంకాళి ఆలయం (ఉప్పుగూడ) - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్
17. శ్రీ బంగారు మైసమ్మ ఆలయం (బోయిగూడ) - అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు
18. శ్రీ బంగారు మైసమ్మ ఆలయం (హరి బౌలి) - గద్వాల విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ మేయర్
19. శ్రీ మహంకాళి ఆలయం (అంబర్ పేట) - బండా ప్రకాష్ ,శాసన మండలి డిప్యూటీ చైర్మన్
20. శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం (అలియాబాద్) - జాటోథ్ రామచందర్ నాయక్, డిప్యూటీ స్పీకర్