ఎవని పాలయిందిరో తెలంగాణ...: టీఆర్ఎస్ కు ఖరీదైన ప్రభుత్వ స్థలం కేటాయింపుపై రేవంత్ సీరియస్

By Arun Kumar PFirst Published May 13, 2022, 1:04 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హైదరాబాద్ జిల్లాలో నూతనంగా కార్యాలయం ఏర్పాటుచేసుకోడానికి ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం తీవ్ర దుమారం రేపుతోంది. 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి హైదరాబాద్ లో దాదాపు ఎకరం భూమిని కేటాయిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హైదరాబాద్ నడిబొడ్డున వందలకోట్ల విలువైన  భూమిని అప్పన్నంగా కొట్టేయడానికి ప్లాన్ వేసారని... అందులోభాగంగానే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పేరిట నాటకాలాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ వ్యవహారంపై టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికన ఘాటుగా స్పందించారు. 

''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి మాత్రం  భూమి ఉంది…ఎవని పాలయిందిరో తెలంగాణ…జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ!''అంటూ రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

అసలేం జరిగిందంటే: 

తెలంగాణ ఏర్పాటు సమయంలో పది జిల్లాలుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని  పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా చేసారు. ఇప్పటికే పాతజిల్లాల్లో మాదిరిగానే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదునాతనంగా సమీకృత కలెక్టరేట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా మౌళికసదుపాయాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తోంది. ఇంతవరకు బాగానే వున్నా టీఆర్ఎస్ కార్యాలయాల కోసం కూడా ప్రభుత్వ భూములు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. 

జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా వుంటాయి కాబట్టి టీఆర్ఎస్ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాజాగా హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం నగర నడిబొడ్డును అత్యంత  ఖరీదైన భూమిని కేటాయించడం తీవ్ర దుమారం రేపింది. బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో వందలకోట్ల విలువచేసే 4,935 చదరపు గజాల స్థలాన్ని టీఆర్ఎస్ ఆఫీస్ కోసం కేటాయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. భూకేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోపై ఇతర పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

బంజారాహిల్స్ లో దాదాపు ఎకరం స్థలాన్ని అధికారికంగా కబ్జా చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించి సఫలీకృతమైందని కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇది అధికారిక కేటాయింపు కాదు ముమ్మాటికీ అధికారిక భూకబ్జా అని అన్నారు. దొడ్డిదారిలో జీవోలు తెచ్చి ఖరీదైన భూములను కబ్జా చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.  

నిరుపేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి కోసం ప్రభుత్వ భూములు వుండవు... కానీ అధికార పార్టీ కార్యాలయం కోసం ఎకరాలకొద్దీ భూములు దొరుకుతాయి అని అన్నారు. ఇప్పటికే వున్న రాష్ట్ర కార్యాలయానికి సమీపంలోనే మళ్లీ  వందలకోట్ల విలువైన స్థలం కేటాయించడం అవసరమా అని శ్రవణ్ నిలదీసారు.  కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఎన్బిటి నగర్ లో స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చిన జీవో 4ను రద్దు చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు.


 

click me!