కరెంట్ కట్ అనే ఫిర్యాదు రావొద్దు: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

By narsimha lodeFirst Published Mar 31, 2024, 9:27 AM IST
Highlights


వేసవిని దృష్టిలో ఉంచుకొని  విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని  సీఎం రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో  విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. శనివారంనాడు  హైద్రాబాద్ సచివాలయంలో  రేవంత్ రెడ్డి  సమీక్ష నిర్వహించారు.  వేసవి కారణంగా  రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని  సీఎం సూచించారు. కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా  అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం చెప్పారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని,  పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి,  విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్కని ఈ విషయంలో సీఎం అభినందించారు. 

  రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల  విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14000 మెగా వాట్ల నుంచి 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని  అంచనా వేసిన విషయాన్ని అధికారులు  సీఎం దృష్టికి తెచ్చారు.

వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కోరారు.

గత ఏడాది (2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగింది. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్తు సరఫరా మెరుగుపడిన విషయాన్ని అధికారులు వివరించారు.


 

click me!