పోలీసు శాఖలో గతంలో తమను ఇబ్బందులకు గురిచేసి.. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని.. అక్రమంగా బదిలీలపై ఉన్న వారిని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
హైదరాబాద్ : కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టుల తర్వాతి వేటు పోలీసు శాఖపైనేనా? అంటే అవుననే సమాచారం తెలుస్తోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్.. రాగానే ప్రక్షాళన మొదలుపెట్టింది. ముందుగా కార్పొరేషన్లతో మొదలుపెట్టి.. తాజాగా పోలీసు శాఖపై దృష్టి మళ్లించినట్లు తెలుస్తోంది.
త్వరలో పంచాయతీ ఎన్నికలు.. వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖలో గతంలో తమను ఇబ్బందులకు గురిచేసి.. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని.. అక్రమంగా బదిలీలపై ఉన్న వారిని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
undefined
తెలంగాణలో ప్రభుత్వ మార్పు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో మరో పెద్ద సంచలనం త్వరలో జరగనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ముకుమ్మడిగా 54 కార్పొరేషన్ లకు చెందిన చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని ఇంటికి పంపించారు. ఆ తర్వాతి వేటు పోలీసు శాఖపై పడనుందని తెలుస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారని.. అలాంటి వారిపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
సచివాలయంలో ఏ మంత్రి ఏ ఫ్లోర్.. ఏ గదిలో ఉన్నారంటే..
ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీసులకు ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని వీరి దృష్టికి వచ్చింది. ఆ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు భారీగా జరిగాయని తాజా ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలో అధికార పార్టీ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే…ఒకవేళ తాము కోరుకున్న పోస్టింగ్ లో తమవారికి కనక రాకపోతే.. ఆ పోస్టింగ్ లో వచ్చిన వారిని బెదిరించి, భయపెట్టి బాధ్యతలు తీసుకోకుండా చేశారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ తమ నియోజకవర్గ పరిధిలో బదిలీలు చేయించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
అలా ఏసిపి, ఇన్స్పెక్టర్ల స్థాయిల్లో…ఈ తరహా బదిలీలు జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువగా ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. మరోవైపు జిల్లాల్లో కూడా ఎస్సై నుంచి అదనపు ఎస్పీ దాకా ఇలాంటి బదిలీలు జరిగినట్లు సమాచారం. దీంతో ఎన్నికల సమయంలో ఆయా అధికారులు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ను ఇబ్బందుల్లో నెట్టారని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల మేరకు అప్పట్లో ఈసీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేసింది. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అందరి సంగతి తేలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటి అధికారుల తీరుపై ఉన్నత స్థాయిలో విచారణ చేయాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఈ విచారణ నివేదిక తరువాత పోలీసు శాఖలో భారీ ఎత్తున బదిలీలు ఉండబోతున్నాయి. ఈ బదిలీల్లో డీజీపీ కార్యాలయం, పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పి/ ఏసిపి లు, ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు పెద్దఎత్తున ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలనూ పూరించబోతున్నట్లు తెలుస్తోంది.