
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డి (Revanth Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు (Komatireddy Venkat Reddy) మరోసారి ఒకే ఫ్రేములో కనిపించారు. మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతతు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో తన ఇంటికి ఎవరూ రావొద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే కొంతకాలంగా ఈ గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గతేడాది నవంబర్‌లో చేపట్టిన వరి దీక్ష వేదికగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే ఫ్రేములో కనిపించారు. స్టేజ్ పై ఇద్దరు ఒకే దగ్గర కూర్చుకున్నారు. ఒకరిని ఒకరు నవ్వూకుంటూ పలకరించుకున్నారు. ఇది కాంగ్రెస్ క్యాడర్‌లో ఒకరకమైన జోష్ నింపిందనే చెప్పాలి.
అయితే ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లతో తనుకున్న గ్యాప్‌ను తొలగించే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు.. ఫ్రేమ్‌లో పక్కపక్కన నిలబడి ప్రెస్‌మీట్ పెట్టారు. దీంతో ఇరువురు నేతల మధ్య గ్యాప్ కొంత తగ్గిందనే చర్చ సాగుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి.. నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. పలు అంశాలపైన ఇరువురు నేతలు చర్చలు జరిపారు. టీ కాంగ్రెస్‌లో భిన్న ధృవాలుగా ఉన్న ఇరువురు నేతలు మధ్య సయోధ్య ఏర్పడటం పార్టీకి కలిసివచ్చే అంశమని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు.
ఇక, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ రేవంత్ రెడ్డి.. Happy times అని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో భేటీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఈరోజు నా నివాసంలో నా సహచర ఎంపీ రేవంత్ రెడ్డిని కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. ఈ ఫొటోలు రాజకీయ వర్గాల్లో వేడి పెంచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అందరం కలిసి తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.