
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భూముల విలువలు పెరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భూముల పెరుగుదలకు ప్రభుత్వమే కారణం అయితే.. రైతుల భూములకు ఎందుకు అంత ధర చెల్లించడం లేదు?. తెలంగాణను తానే అభివృద్ది చేశానని చంద్రబాబు అంటున్నారని.. మరి కేసీఆర్ దానిని కూడా ఆమోదిస్తారా?’’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఏది నచ్చితే దానిని అన్వయించుకోవడం అలవాటేనని రేవంత్ విమర్శించారు. అది రాజకీయ వ్యభిచారం అవుతుందని చిట్‌చాట్‌లో కేసీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గురువారం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.