తెలంగాణలో బోనాల సందడి షురూ... జగదాంబిక అమ్మవారికి మంత్రుల బంగారు బోనం (వీడియో)

By Arun Kumar P  |  First Published Jun 22, 2023, 4:22 PM IST

తెలంగాణలో ఆషాడమాస బోనాల సందడి ప్రారంభమయ్యింది. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి మంత్రులు బంగారుబోనం సమర్పించారు. 


హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి ఆడపడుచులు బోనాలు సమర్పించారు. దీంతో లాంఛనంగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఈ నెల ముగిసేవరకు నగరమంతా కొనసాగనున్నాయి. గోల్కొండ తర్వాత లష్కర్(సికింద్రాబాద్), లాల్ దర్వాజ బోనాలు  ఘనంగా జరుగుతాయి. ఈసారి కూడా బోనాల ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. 

గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన బోనాల ఉత్సవాల్లో మంత్రులు ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. లంగర్ హౌస్ చౌరస్తాలోని ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున సమర్పించాల్సిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు మంత్రులు. పూజలో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు మహిళకు బంగారు బోనమెత్తారు. 

Latest Videos

ఇక లంగర్ హౌస్ నుండి గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయంవరకు తొట్టెల, రథం ఊరేగింపు కొనసాగింది. ఉత్సవ మూర్తులను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుల ఇళ్లలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఊరేగించారు. ఈ ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. 

వీడియో

గోల్కొండ బోనాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుతర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆషాడ బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించిందని గుర్తుచేసారు. 2014 నుండి 2022 వరకు ఎలాగయితే ప్రభుత్వం వైభవంగా బోనాల పండగను నిర్వహించిందో ఈసారి కూడా అలాగే నిర్వహించనుందని అన్నారు. ఈసారి బోనాల ఉత్సవాల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 

బోనాల పండగకు ముందు తొలకరి పలకరింపు శుభసూచకమని మంత్రి అన్నారు. అమ్మవారి ఆశిస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, రాష్ట్రం సుభిక్షంగా వుండాలని అన్నారు. నగరవాసులు బోనాల ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరుకున్నారు. 

click me!