తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వీటిని గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారని, అందులోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణతోపాటు, ఇది వరకే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం వంటి వాటికి కూడా అవకాశం ఇవ్వనుంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయడం, పింఛన్ల దరఖాస్తుకూ అవకాశం ఇవ్వడం, హౌజింగ్ పైనా లబ్దిదారుల నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read: Lok Sabha: దక్షిణాదిపై జాతీయ నాయకుల చూపు?.. వ్యూహం అదేనా?
ఈ రోజు గాంధీ భవన్‌లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇతర అంశాలతోపాటు కొత్త రేషన్ కార్డుల గురించీ మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు తెలిపారు.
రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ సుమారు ఆరు సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. ఇప్పటికే లక్షలుగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రేషన్ కార్డు కేవలం ఆహార సరుకుల కోసమే కాకుండా, ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దికీ కీలకంగా ఉన్నాయి. దీంతో పేదకుటుంబాలైనా రేషన్ కార్డులు లేక ఆ సేవలకు నోచుకోలేకపోతున్నారు. కొన్నేళ్ల తర్వాత వీటి స్వీకరణ ప్రారంభించనున్న నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.