
దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కానీ, సవాలక్ష సమస్యలతో ఓయూ అల్లాడుతోందని టీ టీడీపీ వర్కింగ్ ప్రసిటెండ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
సమైక్య పాలనలో ఓయూ కు న్యాక్ ఏ గ్రేడ్ ఉండేదని, అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రభుత్వం ఓయూ సమస్యలపై పట్టించుకోలేదని దీంతో న్యాక్ గ్రేడ్ ఓయూ కు రాకుండా పోయిందని విమర్శించారు.
వర్సిటీ సమస్యలు పట్టించుకోకుండా శతాబ్ధి ఉత్సవాలు పేరుతో కోట్ల రూపాయిలు ఖర్చు చేయడం వల్ల విద్యార్థులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించడానికి ముందే ఓయూలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపకపోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఏళ్లతరబడి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నవారిని కనీసం ఈ శుభసందర్భంలోనైనా క్రమబద్దీకరించాలని సూచించారు.
వర్సిటీ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని, సిబ్బంది జీతాలకు ఇబ్బంది పడే పరిస్థితి యూనివర్సిటీకి రాకుండా చూడాలన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓయూని సందర్శించిన వేళ కచ్చితంగా వర్సిటీ సమస్యలపై ఆయనకు వివరిస్తామని తెలిపారు.