వేసవిలో తాగునీటి కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.శనివారంనాడు హైద్రాబాద్ సచివాలయంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సీఎం సూచించారు.తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని సీఎం ఆదేశించారు.
undefined
వేసవి కోసం ప్రత్యేకంగా గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కోరారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చూడాలని, అందుకు సరిపడేన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.