తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

By Siva KodatiFirst Published Jun 26, 2021, 8:07 PM IST
Highlights


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనన పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 
 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనన పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియమించింది.

వర్కింగ్‌ ప్రెసిడెంట్లు:

  • అజారుద్దీన్‌
  • గీతారెడ్డి
  • అంజన్‌కుమార్‌ యాదవ్‌
  • జగ్గారెడ్డి
  • మహేశ్ కుమార్‌ గౌడ్‌‌


సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు:

  • చంద్రశేఖర్ సంబాని
  • దామోదర్ రెడ్డి
  • మల్లు రవి
  • పోడెం వీరయ్య
  • వేం నరేందర్ రెడ్డి
  • రమేశ్ ముదిరాజ్
  • గోపిశెట్టి నిరంజన్
  • కుమార్ రావు
  • జావిద్ అమీర్
  • సురేశ్ షెట్కర్

  
ప్రచార కమిటీ ఛైర్మన్: మధుయాష్కీ గౌడ్
కన్వీనర్: అజ్మతుల్లా హుస్సేనీ
ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్: దామోదర రాజనర్సింహా
ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్‌: ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

 

 

జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజుర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తనను తప్పించి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో చెప్పేశారు. అప్పట్నుంచి మరింతగా అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగింది. అయితే పీసీసీ నియామం అంత తేలిక కాదు. తెలంగాణలో ఉన్న వర్గాల కుంపట్లతో ఈ విషయంలో ముందుకు పోలేమని కాంగ్రెసు పెద్దలకూ అర్థమైపోయింది. అందుకే వరస పరాజయాలు ఎదురవుతున్నా సుదీర్ఘకాలంగా ఉత్తమ్‌నే కొనసాగిస్తూ వచ్చారు.

ఆయన దాదాపు అస్త్ర సన్యాసం చేసేశారు. తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుంచే కాంగ్రెసుకు కష్టాలు పెరిగిపోయాయి. ఎంతగా ప్రయత్నించినా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడి నియామకం నెలలుగా సాధ్యపడటం లేదు. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందో లేదో తెలియకపోయినా పోటీదారులు ఎక్కువైపోయారు. ఒకరికి అధ్యక్ష స్థానం కట్టబెడితే మిగిలిన వారంతా ఏకమై తొలి రోజు నుంచే అసమ్మతి రాగాలు మొదలు పెడతారని హైకమాండ్ భయం. ఈ దుస్థితే ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. 

మరోవైపు కులపరమైన గణాంకాలూ పీసీసీ పీఠానికి అడ్డంకిగా మారాయి. రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవనర్ రెడ్డి, జగ్గారెడ్డి తాము అర్హులమని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా లాబీయింగ్ చేశారు. మరోవైపు తెలంగాణ జనాభాలో బీసీలు అగ్రస్థానంలో ఉంటారు. అందువల్ల తాను కూడా రేసులో ఉన్నానంటున్నారు మాజీ ఎంపీ మధు యాష్కీ . మరోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు కూడా పీసీసీ పదవిపై ఆశపడ్డారు.

కానీ వీరందరికంటే ప్రజల్లో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. అధిష్ఠానం సైతం అనేక విడతలుగా నాయకులు, కార్యకర్తల నుంచి సర్వేలు నిర్వహించగా ఆయనవైపే మొగ్గు కనిపించింది. అయితే పోటీలో ఉన్న నాయకులందరికంటే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్. టీడీపీ నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ తనదైన వాగ్థాటి, ప్రజాకర్షణ, దూకుడు.. హైకమాండ్‌ను రేవంత్ వైపే మొగ్గుచూపేలా చేసింది. మరి టీపీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు తాజా పరిణామంతో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

click me!