కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య దోస్తీ కుదురుతుందని అంతా అనుకున్నారు. కానీ, అది కుదిరేలా లేదని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ తేల్చింది. అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి కేటీఆర్, హరీశ్ రావు, అక్బరుద్దీన్ ఒవైసీలు గట్టిగా వాదించగా.. కాంగ్రెస్ అందుకు తగినట్టుగా కౌంటర్ ఇచ్చింది.
AIMIM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అసెంబ్లీలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఏఐఎంఐఎం మద్దతు కోసం ఆ పార్టీకి కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఎంఐఎం కూడా తొలుత సానుకూలంగా మసులుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇవ్వడం డౌటే అనే అనిపిస్తున్నది. దీంతో ఏ పార్టీ అయినా సరే.. రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇచ్చే ఎంఐఎం రూటు ఈ సారి మారనుంది. అలాగే, కాంగ్రెస్ కూడా బొటాబొటీ మెజార్టీతోనే ప్రభుత్వాన్ని కొనసాగించే అగత్యం లేదంటే.. ఆకర్ష్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉన్నది. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశం ఇచ్చి ఎంఐఎంను మచ్చిక చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఆ అవకాశాన్ని ఒవైసీ అందుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చారు. దీంతో త్వరలో కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య దోస్తీ కుదురుతుందని, ప్రభుత్వానికి అదనంగా మరో ఏడుగురు ఎమ్మెల్యేల బలం వస్తుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్రంలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తాయని స్పష్టం అయిపోయింది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇచ్చాయి. సీఎం, మంత్రులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య ఘాటు వాదనలు జరిగాయి. ఇది ఎంఐఎంకు కూడా విస్తరించింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వాడిగా వాదనలు నడిచాయి.
ఓల్డ్ సిటీలో 500 కరెంట్ పోల్స్ ఏర్పాటు గురించి అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతుండగా.. మానకొండూరు నుంచి తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ కామెంట్ చేశారు. మీరు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 9 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం ఈ కరెంట్ పోల్స్‌ను కూడా అడగలేకపోయారా? అంటూ సెటైర్ వేశారు. దీనికి అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు.
Also Read: Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ!.. ఆహ్వానంపై దిగ్విజయ్ సింగ్ కామెంట్
పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మధ్యలో జోక్యం చేసుకోరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేను చిన్నచూపుతో మాట్లాడారు. దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించి ఫస్ట్ టైం ఎమ్మెల్యేను చిన్నది చేసి మాట్లాడొద్దని హితవు చెప్పారు. కానీ, ఒవైసీ పెడచెవిన పెట్టారు.
ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన నాయకుడని, ఆయనను అలా చిన్నదిగా చేసి మాట్లాడితే.. నీ గౌరవమే తగ్గిపోద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, అక్బరుద్దీన్ తన దూకుడును కొనసాగిస్తుండగా.. అయితే, ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి సహకరించాలని సీఎం అన్నారు. అసలు ఎంఐఎం పార్టీ ముస్లిం అభ్యర్థులనే ఓడించిందని, అసలు ముస్లింలకు ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయ్యారు.
‘ముస్లింల ఓట్లతోనే ఒవైసీ గెలిచాడా? హిందువులు ఓట్లు వేయలేదా? పాత బస్తీ అభివృద్ధి మా బాధ్యత. నీవు మాత్రమే ముస్లింలకు ప్రతినిధివి కాదు. ముస్లిం సమస్యలపై ఎంఐఎంకు పేటెంట్ ఏమీ లేదు’ అని రేవంత్ అన్నారు.
Also Read: Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికలకూ సునీల్ కనుగోలుకు బాధ్యత.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లతో ఆయన సంబంధాన్ని ప్రస్తావించారు. దీంతో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ పార్టీతో దోస్తీ చేసుకోవడం ఎంఐఎంకు అలవాటు అని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.