కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ ‘‘స్వేదపత్రం’’ .. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

By Siva Kodati  |  First Published Dec 22, 2023, 7:13 PM IST

‘‘శ్వేతపత్రానికి’’ కౌంటర్‌గా గులాబీ పార్టీ ‘‘స్వేదపత్రానికి’’ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన .. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని కేటీఆర్ హెచ్చరించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీల నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందంటూ బీఆర్ఎస్ ఆరోపించింది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘‘శ్వేతపత్రానికి’’ కౌంటర్‌గా గులాబీ పార్టీ ‘‘స్వేదపత్రానికి’’ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. 

తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన .. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని కేటీఆర్ హెచ్చరించారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమని.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్ధితుల్లో ఊరుకోమని ఆయన పేర్కొన్నారు. అందుకే గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీ ఉదయం 11 గంటలకు స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని కేటీఆర్ పోస్ట్ చేశారు. 

Latest Videos

కాగా.. నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్‌లో యాదాద్రి ప్రాజెక్ట్, ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్ట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి .. స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. 24 గంటల విద్యుత్‌పై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం అసెంబ్లీలో విద్యుత్ బిల్లుల బకాయిలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. విద్యుత్ బిల్లుల ఎగవేత విషయంలో సిద్ధిపేట మొదటి స్థానంలో వుండగా.. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ వున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి గెలిచిన వారే గత పదేళ్లుగా తెలంగాణను పాలించారని ఆయన చురకలంటించారు.

బీఆర్ఎస్, ఎంఐఎం వేరు వేరు కాదని.. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని పాలించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని .. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ వుంటే వినేందుకు తాము సిద్ధంగా లేమని రేవంత్ తేల్చిచెప్పారు. 
 

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం

పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..

విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..

అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…

— KTR (@KTRBRS)
click me!