కేటిఆర్ కు మోడీ అభినందన లేఖ

Published : Sep 14, 2017, 06:29 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కేటిఆర్ కు మోడీ అభినందన లేఖ

సారాంశం

స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని లేఖ మిషన్ భగీరథ చేపట్టడం హర్షనీయం

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ లేఖలో ప్రధాన మంత్రి కోరారు. జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల మేరకు స్వచ్చత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్చత ఉండే మన దృక్పథం సమాజం పట్ల కూడా ఉంటుందని మహాత్మగాంధీ తెలిపారని, స్వచ్ఛ భారత్ ను కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధించగలుగుతామని ఈ సందర్భంగా ప్రధాని లేఖలో తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరు స్వచ్చత పాటించాల్సిన అవసరం ఉందని మహాత్మాగాంధీ బోధించారని తెలిపారు. వచ్చే నెలలో జరుపుకోనున్న గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా, బాపూజీ బోధించిన ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛత హి సేవ’ అనే నినాదంతో ముందుకు పోదామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా స్వచ్ఛత కార్యక్రమాలను తీసుకోవాల్సిందిగా కోరారు. సమాజంలో స్వచ్ఛత కోసం పనిచేయడం అంటే పేద, బలహీన వర్గాలకు సేవ చేయడమే అని, దుర్గంధ పూరితమైన వాతావరణం ఆయా వర్గాలను తీవ్రంగా నష్ట పరుస్తుందని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నదని అభినందించారు. ప్రస్తుతం ఉన్న నదులు, సరస్సులు, చెరువులను కాపాడుకోవడంతో పాటు, వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరాన్ని తెలిపారు.  అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ యే  సేవ అనే నినాదంతో స్వచ్చ భారత్ కోసం కొంత సమయం కేటాయించి, భాగస్వాములు కావాలని మంత్రిని ప్రధాని కోరారు. 
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తించినందుకు ప్రధానికి మంత్రి కేటీ రామారావు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ భారత్ కార్యక్రమంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో తడి పొడి చెత్త , స్వచ్ఛ ఆటోలు, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వినూత్నమైన అంశాలతో ముందుకు పోతున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రధానమంత్రి సందేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని మంత్రి పేర్కొన్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu