మంత్రి పట్నం సోదరుడికి రేవంత్ సోదరుడి షాక్ (వీడియో)

First Published Feb 6, 2018, 4:44 PM IST
Highlights
  • కొడంగల్ లో ప్రొటోకాల్ వివాదం
  • ప్రొటోకాల్ లేకపోయినా చెక్కులు పంచిన ఎమ్మెల్సీ పట్నం
  • అడ్డుకున్న రేవంత్ వర్గం.. ఉద్రిక్తత
  • లాఠీలకు పని చెప్పిన పోలీసులు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతిరెడ్డి ఒకవైపు.. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి ఇంకకోవైపు.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలు జరిగిపోయాయి.. నినాదాలు ప్రతినినాదాలు చేసుకున్నారు. పరిస్థితి కంట్రోల్ తప్పే సమయంలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అంతిమంగా మంత్రి పట్నం సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి అక్కడినుంచి వెనుదిరగాల్సి వచ్చింది. విచిత్రం ఏందంటే.. అక్కడ రెవెన్యూ అధికారులు రేవంత్ వర్గం వైపు నిలవగా పోలీసులు మాత్రం మంత్రి పట్నం వైపు నిలిచారు. ఈ సంఘటన తాలూకు వివరాలు చదవండి. వీడియోలో చూడండి.

కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తాయో రావో తెలియదు.. కానీ రేవంత్ కు టిఆర్ఎస్ కు మధ్య గట్టి వార్ నడుస్తోంది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టిఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నది. అంతే రీతిలో అధికార పార్టీపై రేవంత్ కూడా కౌంటర్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో ఉన్న కుదురుమళ్ల అనే గ్రామంలో మంత్రి పట్నం సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు గ్రామానికి వచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఉందని ముందే తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలు పట్నం నరేందర్ రెడ్డికి చెక్కులు పంచే అర్హత ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ లేని వ్యక్తి వచ్చి చెక్కులు పంచితే సహించేదిలేదని హెచ్చరికలు జారీ చేశారు.

దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయమే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతిరెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో ఆ మండల ఎమ్మార్వో వద్దకు వెళ్లాడు. పట్నం నరేందర్ రెడ్డికి చెక్కులు పంచే ప్రొటోకాల్ ఉందా? లేదా అని అడిగిర్రు. దానికి ఎమ్మార్వో ఎమ్మెల్సీకి ప్రొటోకాల్ లేదని బదులిచ్చారు. అదే అంశాన్ని రాతపూర్వకంగా తీసుకున్నారు తిరుపతిరెడ్డి. తర్వాత చెక్కులు పంచేందుకు వచ్చిన నరేందర్ రెడ్డి పై ఆందోళనకు పూనుకున్నారు. ప్రొటోకాల్ లేని వ్యక్తి వచ్చి ఎలా చెక్కులు పంచుతారని ప్రశ్నించి నిలదీశారు. దీంతో రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్యుద్ధం నడిచింది.

ఇంకో విషయమేమంటే.. దౌలతాబాద్ మండలం అంటే.. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కంచుకోట. ఆ మండలంలో నరేందర్ రెడ్డి చెక్కుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిసినా.. గుర్నాథ్ రెడ్డి వర్గం ఆ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఇంకేముంది.. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి మనుషులు నాలుగైదు వందల మంది జమైర్రు. ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ వారు వందకు అటూ ఇటు సంఖ్యలో ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయలేక పోలీసులు కిందా మీదా అయిపోయారు. తుదకు పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో అక్కడ వాతావరణం సద్దుమణిగింది.

అయితే పట్నం నరేందర్ రెడ్డి ఆ గ్రామంలో పోలీసులు సహకారంతో చెక్కుల పంపిణీ చేపట్టిన తర్వాతే అక్కడినుంచి వెనుదిరిగారు. మొత్తానికి అధికార పార్టీకి మరోసారి రేవంత్ వర్గం ఝలక్ ఇచ్చినట్లైందని చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం.. వీడియో పైన చూడొచ్చు.

 

click me!