తెలంగాణలో పాలన అస్తవ్యస్తం.. మాజీ అధికారులు, మేధావవులతో కలిసి పార్టీ స్థాపిస్తాం: రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

By Mahesh KFirst Published Nov 11, 2022, 5:20 AM IST
Highlights

ఆకునూరి మురళి గురువారం కొత్తగూడెంలో విలేకరులతో సంచలన విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో మరో చిన్న పార్టీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని న్నారు.
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో పార్టీ రాబోతున్నట్టు తెలుస్తున్నది. ప్రముఖుడు, సోషల్ డెమోక్రటిక్ ఫోరం నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని వివరించారు. అధికారంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచిస్తున్నదని పేర్కొన్నారు. గురువారం ఆయన కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉద్యమం పేరుతో ప్రజా అభిమానాన్ని టీఆర్ఎస్ పార్టీ చూరగొన్నదని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రధాన డిమాండ్లుగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో అందలమెక్కిన టీఆర్ఎస్ పాలన సజావుగా చేపట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి సమాజంలో మార్పులు తీసుకురావాలనే, ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తాము కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూతన వ్యవస్థ ఏర్పాటుకు పాటుపడే నిస్వార్థపరులు, వీఆర్ఎస్ తీసుకున్న అధికారులు, మేధావులతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Also Read: మునుగోడు ఉపఎన్నిక రద్దు చేయండి.. కౌంటింగ్‌కు ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలనం

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పోలిక తెచ్చారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా డీఈవోలు, ఎంఈవోలతో సమీక్షిస్తున్నారని వివరించారు. అదే తెలంగాణలో కనీసం గంట సేపు కూడా వీటిని సమీక్షించే నాథుడే లేడని విమర్శలు చేశారు. 

కాగా, తెలంగాణ ప్రభుత్వం మన ఊరు, మన బడి పథకాన్ని  మొదలు పెట్టిందని, కానీ, ఆ పథకం ఫలాలు ఇంకా కనిపించడం లేదని వివరించారు. మన ఊరు, మన బడి పథకం అతీగతీ లేకుండా పోయిందని చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు సంధించారు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 10 లక్షల కోట్ల మేరకు బడాబాబులకు, వారి కంపెనీలకు రుణాలను మాఫీ చేసిందని అన్నారు. వీరికి రుణ మాఫీ చేయడం కంటే అదే డబ్బును దేశంలోని పది లక్షల పాఠశాలలకు ఒక్కోదానికి రూ. కోటి చొప్పున కేటాయిస్తే.. ఆ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందేవని అన్నారు.

click me!