140 ఫోన్లు .. లంచాలకు ప్రత్యేక వ్యవస్థ, లిక్కర్ స్కామ్ చేశారిలా : శరత్ చంద్రారెడ్డి అరెస్ట్‌లో కీలకాంశాలు

By Siva Kodati  |  First Published Nov 10, 2022, 8:32 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని ... 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ రిమాండ్ డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్‌ ఎలా జరిగిందో ఈడీ అందులో వివరించింది. అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు పేర్కొంది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. డిజిటల్ డివైజస్‌తో పాటు రికార్డులు సీజ్ చేశామని ఈడీ స్పష్టం చేసింది. 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని.. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది. సెల్‌ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. 

Latest Videos

ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కాం:శరత్ చంద్రారెడ్డి,వినయ్ బాబులను కస్టడీ కోరిన ఈడీ

మరోవైపు... శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబులను ఈడీ అధికారులు గురువారం అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వీరిని కస్టడీకి అనుమతించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరగా.. కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని.. అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో వీరిని ప్రశ్నించాలని సూచించింది. 
 

click me!