కొంతమందికి నేను నచ్చకపోవచ్చు.. కొందరికి ఫామ్‌హౌస్‌లు అభివృద్ది కాదు: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై

By Sumanth KanukulaFirst Published Jan 26, 2023, 8:10 AM IST
Highlights

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. 

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. రాజ్‌భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్పీకరించారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద  రాజ్యాంగం కలిగిన  దేశం మనదని అన్నారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని గుర్తుచేశారు. 

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. ఐటీ, వైద్య రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. దేశంలోని అన్ని నగరాలతో హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఉందన్నారు. ఇటీవల ప్రధాని మోదీ సికింద్రాబాద్‌కు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించారని చెప్పారు. రాష్ట్రాభివృద్దికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగస్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ స్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 

కొత్త భవనాలు నిర్మించటం మాత్రమే అభివృద్ది కాదు.. నేషనల్ బిల్డింగ్ అనేది అభివృద్ది అన్నారు. కొందరికి ఫామ్‌హౌస్‌లు కాదు.. అందరికి ఫామ్‌లు కావాలని అన్నారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు ఇస్తున్న ప్రధాని మోదీకి  థాంక్స్‌ చెప్పారు. 

మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని అన్నారు.  ‘‘తెలంగాణ గౌరవాన్ని నిలబెడుదాం. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ  హక్కులను నిబెట్టుకుందాం. తెలంగాణతో నాకున్న అనుబంధం మూడేళ్ల నుంచి కాదు.. ఇది పుట్టుకతో జీవి నుంచే వచ్చింది. తెలంగాణ అభ్యున్నతితో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం హార్డ్ వర్క్, నిజాయితీ, ప్రేమ. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తాను’’ అని గవర్నర్ తమిళిసై తెలుగులో ప్రసంగించారు. ఇక, అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. 

click me!