ఫైల్స్‌ ఆమె దగ్గరే, కదలనివ్వడం లేదు.. గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి విమర్శలు

By Siva KodatiFirst Published Jan 25, 2023, 9:30 PM IST
Highlights

అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్‌ తమిళిసై తన వద్దే వుంచుకుని కదలనివ్వడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. నియోజకవర్గం కోసం ఈటల తట్టెడు మట్టి కూడా పోయలేదని దుయ్యబట్టారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై  ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్‌ కదలనివ్వడం లేదని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అటు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ పైనా ఆయన ఫైర్ అయ్యారు. నియోజకవర్గం కోసం ఈటల తట్టెడు మట్టి కూడా పోయలేదని దుయ్యబట్టారు. మాట్లాడితే ఆయనను టీవీల్లో చూడాలని చెబుతున్నారని.. ఈటల ఏమైనా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటున్నారా అంటూ కౌశిక్ రెడ్డి సెటైర్లు వేశారు. 

మాజీ ఎంపీ వివేక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని హుజురాబాద్‌లో ఖర్చు చేశామని ఈటల చెబుతున్నారని.. ఆ డబ్బు ఏమైందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఐటీ, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని కౌశిక్ రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో కేసీఆర్ నీ వెంట వుండటం వల్లే గెలిచావని, ఇప్పుడు ఆయన తన వెంట వున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందామంటూ ఈటలకు ఆయన సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఈటల ఆరోపిస్తున్నారని.. దీనిపై హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. 

Also REad: రిపబ్లిక్ డే వేడుకల వివాదం.. కేసీఆర్ చెబితేనే రాజ్‌భవన్‌కి : మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

కాగా.. రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం చివరికి హైకోర్టు మెట్లెక్కడం.. న్యాయస్థానం సైతం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెబితేనే తామంతా రాజ్‌భవన్‌లో వేడుకలకు హాజరవుతామన్నారు. ప్రొసీజర్ ప్రకారమే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని మంత్రి తెలిపారు. రాజ్‌భవన్‌లో జెండా ఎగురవేయొద్దని తాము గవర్నర్‌కు చెప్పామా అని తలసాని ప్రశ్నించారు. 

వేడుకల నిర్వహణకు సంబంధించి సీఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తారని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గవర్నర్ రోల్ ఏంటో, సీఎం పాత్ర ఏంటో తమకు తెలుసునని మంత్రి అన్నారు. గవర్నర్ కంటి వెలుగు కార్యక్రమానికి వస్తానంటే తాము ఆపలేదని తలసాని గుర్తుచేశారు. ఏ వేడుకలైనా నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేమిటని తలసాని ప్రశ్నించారు. మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చునని.. బండి సంజయ్ మోడీకి ఆ సలహా ఇచ్చుకోవచ్చని శ్రీనివాస్ యాదవ్ చురకలంటించారు. ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని తలసాని ఎద్దేవా చేశారు
 

click me!