Agnipath Protest in Secunderabad : ‘ఇప్పుడు కాకపోతే జవాన్లు కాలేరు’.. రెచ్చగొట్టిన డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు

By SumaBala Bukka  |  First Published Jun 21, 2022, 8:03 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని డిఫెన్స్ అకాడమీల ప్రతినిధులు ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేరని అభ్యర్థులను రెచ్చగొట్టినట్టు సమాచారం. 


హైదరాబాద్ : *కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒకవేళ ‘అగ్నిపథ్’ పరీక్షలో ఫెయిల్ అయితే వయసు పరిమితి దాటిపోయి మరోసారి రాసేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేం. అందుకే బీహార్, రాజస్థాన్ లలో చేసినట్లు చేద్దామని అనుకుంటున్నాం’  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన నిందితుల్లో కొందరు రైల్వే పోలీసులతో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా పోలీసులు ప్రశ్నించారు. వీరు తెలిపిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచి న్యాయస్థానంలో సమర్పించారు.

ఎక్కువమంది 20 ఏళ్లు దాటిన వారే..
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉండగా..  వీరిలో 51 మంది 20 యేళ్లు దాటినవారే. ఏ2గా ఉన్న పృథ్వీరాజు వయస్సు 23 సంవత్సరాలు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన రెండు వేల మందిలో 20 ఏళ్లు దాటిన వారంతా  అగ్నిపథ్ ను అడ్డుకోవాలనుకున్నారు. వీరికి కొన్ని డిఫెన్స్ అకాడమీ లు సహకరించడంతో విధ్వంసం సృష్టించేలా రెచ్చగొట్టాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇందుకు 8 వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Latest Videos

undefined

అకాడమీల  కార్యాచరణ
వరంగల్, కరీంనగర్,, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించారు.  బుధవారం రాత్రి కార్యాచరణ మొదలుపెట్టారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల వారు అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన వారికి హైదరాబాద్కు రావాలంటూ వాట్సాప్ సందేశాలు పంపించారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో ఉంటున్న వారిని హైదరాబాద్ కు తరలించారు.

సికింద్రాబాద్,  విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించాలని.. నాలుగైదు రోజుల పాటు బయటి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని చెప్పారు.  ఆదిలాబాద్, నిజామాబాద్  జిల్లాలవారి  ఇ బాగోగులను ఇద్దరు డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు చూసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1500 మంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పించారు.

రైల్వే పోలీసుల అదుపులో క్షతగాత్రులు…
పోలీసుల కాల్పులు, ఘర్షణలో గాయపడిన తొమ్మిది మంది నిందితులు మల్లికార్జున్, రంజిత్, శ్రీకాంత్, పరశురాం, కుమార్, మోహన్, భరత్ కుమార్, విద్యాసాగర్, లక్ష్మణ్ రెడ్డిలను రైల్వే పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని గాంధీ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయడంతో నేరుగా రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. మంగళవారం రైల్వే జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశాలున్నాయి.  చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నవారిని పీటీ  వారెంట్ ద్వారా విచారించనున్నారు. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు హైదరాబాద్ పోలీసులకు ఇంకా బదిలీ కాలేదు. మరోవైపు బస్సులపై రాల్లు వేసి అద్దాలు పగలకొట్టిన కేసులో పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు. 

నిందితుల్లో కానిస్టేబుల్ శిక్షణ అభ్యర్థులు..
విధ్వంసం కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్ ప్రధాన నిందితుడని (ఏ1)  కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇతను క్రీడల్లో శిక్షణ పొందుతున్నాడు అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్ ను ఏ2గా పేర్కొన్నారు. 56 మంది నిందితుల్లో మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు హైదరాబాదులో కానిస్టేబుల్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. మరో ఇద్దరు బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా, ముగ్గురు రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. ఒక యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మిగిలినవారు కళాశాలల విద్యార్థులు. 
 

 

click me!