మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.
హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిని చూపుతున్నవారికి స్వాగతం పలుకుతామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేశారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంచి నాయకుడని ఆమె కితాబునిచ్చారు.
ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు దక్కలేదు. పాలేరు నుండి బరిలోకి దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే పాలేరు బీఆర్ఎస్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే ఆ పార్టీ కేటాయించింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీల్లో చేరాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారు.
undefined
మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు నిన్న సమావేశమయ్యారు. పాలేరు టిక్కెట్టు ఇవ్వకుండా తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ నాయకత్వం అవమానించిందని వారు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడాలని తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు , మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు నిన్న హైద్రాబాద్ లో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఇద్దరు నేతలు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారని సమాచారం. ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు కీలక పదవిని కట్టబెట్టనున్నట్టుగా కేసీఆర్ సమాచారం పంపారనే ప్రచారం సాగుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తుమ్మల నాగేశ్వరరావును నామా నాగేశ్వరరావు కోరినట్టుగా తెలుస్తుంది. సీఎం సూచన మేరకు తాము వచ్చినట్టుగా నామా నాగేశ్వరరావు వివరించారని సమాచారం.
also read:బీఆర్‌ఎస్ టిక్కెట్టు నిరాకరణ: తుమ్మలతో నామా భేటీ, బుజ్జగింపులు
2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నారు. ఆ తర్వాత 2016 లో పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు.
2018 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డికి చెందిన వర్గాలుగా బీఆర్ఎస్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పాలేరు టిక్కెట్టును బీఆర్ఎస్ నాయకత్వం కందాల ఉపేందర్ రెడ్డికే కేటాయించింది. ఈ పరిణామం తుమ్మల నాగేశ్వరరావును అసంతృప్తికి గురి చేసింది.
ఈ తరుణంలో తుమ్మల నాగేశ్వరరావు ను బుజ్జగించేందుకు నామా నాగేశ్వరరావును కేసీఆర్ పంపారు. అయితే ఈ తరుణంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు తారి తీసింది.