ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ టిక్కెట్టును మదన్ రెడ్డికి కేటాయించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో మంత్రి హరీష్ రావు ఇంటి ముందు ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే కేటాయించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కు చెందిన ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు హైద్రాబాద్ లోని మంత్రి హరీష్ రావు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మదన్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రకటించని నాలుగు స్థానాల్లో నర్సాపూర్ కూడ ఒకటి.
బీఆర్ఎస్ టిక్కెట్టు తనకు దక్కకపోతే రాజీనామా చేస్తానని మదన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మదన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెల 21న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు.
కానీ ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. త్వరలోనే ఈ జాబితాను ప్రకటించనన్నారు. కేసీఆర్. అయితే నర్సాపూర్ టిక్కెట్టు మదన్ రెడ్డికే కేటాయించాలని ఇవాళ ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హరీష్ రావు వద్ద తమ డిమాండ్ ను విన్పించే ప్రయత్నం చేశారు. మదన్ రెడ్డికే టిక్కెట్టు ఇవ్వాలని కోరుతూ ప్ల కార్డులు ప్రదర్శించారు. మంత్రి హరీష్ రావును కలిసేందుకు మదన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నెల 21న 115 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టారు. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ స్థానం నుండి టిక్కెట్టు కోసం మదన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న మెదక్ లో కొత్త కలెక్టరేట్, ఎస్పీ , బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమల్లో మదన్ రెడ్డి కూడ పాల్గొన్నారు.
ఇవాళ మంత్రి హరీష్ రావు ఇంటి ముందు మదన్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేయడం ద్వారా టిక్కెట్టు కోసం ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంటి బీఆర్ఎస్ టిక్కెట్టును కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అందరి కంటే ముందుగానే ప్రకటించింది.