
చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో అధికార పార్టీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
ఈ విషయాన్ని గమనించిన అధికారులు హుటాహుటిన అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరినందుకు లంచం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నారంటూ ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం.
సర్పంచ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ అన్నాడి రవీందర్ రెడ్డి గ్రామపంచాయతీలో చేపట్టిన పనులకు ఏడాదిగా బిల్లులు రావడంలేదు. సుమారుగా 25 లక్షల రూపాయల పెండింగ్ లో ఉన్నాయనీ, ఎంత తిరిగినా బిల్లులు మంజూరు చేయక ఎంపీడీవో అధికారులు చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు త్వరగా వస్తాయనే ఉద్ధేశంతో రూ.5లక్షలు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకువచ్చాననీ. దీంతోపాటు గ్రామపంచాయతీ నిధులు బిల్లులు రావల్సి ఉందని తెలిపారు. అప్పులు చేసి చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, వడ్డీలు పెరగడంతోపాటు అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన బిల్లులు మంజూరు చేయాలని ఎంపిఓ ఫయాజ్ అలీ ని అడగ్గా.. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు.
ఈ మేరకు ఎంపీడీఓ కి మొత్తం పదిహేను వేల రూపాయలకు కానూ.. 5000 రూపాయలను లంచంగా ఇచ్చాననీ, మిగితా 10,000 ఇస్తేనే చెక్కు మంజూరు చేస్తానని డిమాండ్ చేశాడని, గత 15 రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కన్నీరుమున్నీరయ్యాడు. సుమారుగా 25 లక్షల రూపాయల పెండింగ్లో ఉన్న బిల్లులు రావాలని ఎంత తిరిగినా బిల్లులు మంజూరు చేయక చాలా ఇబ్బందులకు గురి చేశాడని , ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి పురుగుల మందు సేవించినట్లు తెలిపారు.